తెలుగు రాష్ట్రాల్లో వాస్తు గురించి ఈ మధ్య బాగా చర్చ జరుగుతోంది. ఇద్దరు ముఖ్యమంత్రులూ వాస్తుపై పడ్డారు! తెలంగాణ సీఎం కేసీఆర్‌కు సచివాలయం వాస్తు ఏమాత్రం కలిసి రాలేదట! అందుకే, ఏకంగా ఆ భవనాన్ని కూలగొట్టేసేందుకు సిద్ధపడుతున్నారు. ‘ఆ భవనంలో పొడుగైనవారు ఎవరూ ఉండరు’ ఆయనకు ఏ సిద్ధాంతో చెప్పాడట. అంతే, అక్కడి నుంచి ఆయన సచివాలయానికి రావడం మానేశారు! ఆ భవనంలో పనిచేసిన సీఎంల కుమారులు ముఖ్యమంత్రులు కాలేదన్న భావన కేసీఆర్‌కి ఉందట! ఏదైతేనేం, కొన్ని దశాబ్దాలపాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కి సేవలు అందించిన భవనాన్ని వాస్తు నమ్మకాల పేరుతో ఎందుకూ పనికిరాని భవనం అనే ముద్ర వేశారు. ఇప్పుడున్న సచివాలయం వాస్తుపరంగా తెరాస సర్కారుకు కలిసిరాలేదని తేల్చేశారు. దాదాపు ఇలాంటి నమ్మకాలే ఆంధ్రా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కూడా తీవ్రంగా ఉన్నాయి కదా! ఈ మధ్యనే వెలగపూడిలో నిర్మించిన కొత్త సీఎం ఆఫీస్‌కి చంద్రబాబు షిఫ్ట్ అయిన సంగతి తెలిసిందే. మరి, దాని వాస్తు గురించి కూడా ఆయన ఇప్పుడు మాట్లాడటం విశేషం!
వెలగపూడి భవనం వాస్తు కలిసి వచ్చిందని చంద్రబాబు అన్నారు. అక్కడికి వచ్చాక తాను చేసిన తొలి రెండు సంతకాలు సక్సెస్ ఫుల్‌గా వర్కౌట్ అయ్యాయి అన్నారు. మొదటిది… ప్రధానమంత్రి నరేంద్రమోడీకి లేఖ రాయడం! నల్లధనం నిర్మూలనపై సూచనలు చేస్తూ ఆయనకి లేఖ రాసి సంతకం పెట్టారట! రెండోది… డ్వాక్రా మహిళలకు రెండో విడత నిధులు మంజూరు చేస్తూ మరో సంతకం! ‘ఫస్ట్‌ది అయింది. రెండోది కూడా ఫర్ ఫెక్ట్ గా అయింది. అంటే, వాస్తు బలం చాలా బాగుంది. వెలగపూడి సచివాలయం వాస్తు బలంగా ఉందని చెప్పడానికి ఇదే సాక్ష్యం’ అని చంద్రబాబు చెప్పారు.
పోన్లెండీ… తెలంగాణకు కలిసిరాని సచివాలయ వాస్తు, ఏపీ విషయంలోనైనా కలిసి వచ్చింది! ఒకవేళ ఏదైనా తేడా వచ్చి ఉంటే చంద్రబాబు కూడా కూల్చి కట్టేసేవారేమో! అయినా, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవారికి ఈ పట్టింపులేంటో అర్థం కాదు! సచివాలయాలు అనేవి సొంత ఇళ్ల కావు కదా. తరతరాలుగా అక్కడే వారు ఉండిపోతారా..? జీవితాంతం అదే కుర్చీలో కూర్చుని ఉండిపోతామనే భ్రమల్లో మన సీఎంలు ఉన్నట్టున్నారు. ఈ వాస్తు పిచ్చి ఇలాగే పెరుగుతూ పోతే, పరిస్థితి ఎక్కడికి దారి తీస్తుందంటే… రేపొద్దున్న అధికారం మారిన తరువాత కొత్త ముఖ్యమంత్రులు ఎవరో వస్తారు కదా! రాగానే వారు కూడా తమ జాతకాలకు సచివాలయ వాస్తు సరిపోయిందా లేదా అని చూసుకుంటారు. ఒకవేళ వారికీ వాస్తుకీ పొసగకపోతే.. మళ్లీ కూలకొట్టి కొత్తవి కట్టుకుంటారా..? వాస్తుపై నమ్మకాలుంటే ఇంటి దగ్గర చూసుకోవాలి. అంతేగానీ, సచివాలయం బాలేదని ఒకరు, సచివాలయం వాస్తు కలిసి వస్తోందని మరొకరు బహిరంగంగా ప్రకటనలు చేస్తూ ప్రజలకు ఎలాంటి సందేశం ఇచ్చినట్టు..? తరువాతి తరం నాయకులకు ఎలాంటి మార్గదర్శకత్వం వహిస్తున్నట్టు..?