హైదరాబాద్: కొన్ని పత్రికలు తన మాటలను వక్రీకరిస్తున్నాయంటూ కేంద్ర పట్టణాభివృద్ధిశాఖమంత్రి వెంకయ్య నాయుడు మండిపడ్డారు. హైదరాబాద్లో మీడియాతో మాట్లాడిన అయన, తెలుగుప్రజలకు తాను తప్ప దిక్కులేదని తాను అన్నట్లుగా ఒక పార్టీ పత్రిక రాసిందని, ఆ పార్టీ విధానం ప్రకారం ఆ పత్రిక రాసి ఉండొచ్చని అన్నారు. తాను అటువంటి వ్యాఖ్యలు చేయలేదని చెప్పారు. తాను తెలుగు రాష్ట్రాలనుంచి ఎంపిక కాకపోయినా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సమస్యలపై ఎవరు వచ్చినా తక్షణమే స్పందించి సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తున్నానని అన్నారు. తనపై తప్పుడు ఆరోపణలు చేయటం, దురుద్దేశాలు ఆపాదించటం తగదని, ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేదని కొందరు అవగాహనా రాహిత్యంతో మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీఆర్ ప్రభంజనం వీచిన సమయంలోనే తాను ఎమ్మెల్యేగా గెలిచానని చెప్పారు. రాష్ట్ర విభజనవేళ సోనియాముందు తలలు వంచుకుని నిల్చున్నవారు ఇప్పుడు ప్రధానమంత్రి మోడి మెడలు వంచుతాననటం హాస్యాస్పదమని అన్నారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఎన్టీఆర్, ఏఎన్నార్ రెండుకళ్ళయితే చిరంజీవి మూడోకన్ను అని ట్విట్టర్లో పేర్కొన్నారు. చిరంజీవి జీవితం అర్థవంతంగా ముందుకు సాగాలంటూ శుభాకాంక్షలు తెలిపానన్నారు.
గురువారంనాడు తాడేపల్లిగూడెంలో నిట్ విద్యాసంస్థకు శంకుస్థాపన కార్యక్రమంలో మాట్లాడుతూ, నాడు విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ తరపున మాట్లాడటానికి దిక్కులేదని అన్నారు. తాను ఇక్కడకు వచ్చినప్పుడల్లా ఏదో ఒక ప్రాజెక్ట్ తీసుకొస్తున్నానని వెంకయ్యనాయుడు చెప్పారు. తనను విమర్శించేవారిపై మండిపడుతూ, తాను తెలుగురాష్ట్రాలలో ఎన్నిక కాలేదని, భవిష్యత్తులోకూడా ఇక్కడనుంచి పోటీచేయబోనని తెగేసి చెప్పారు. ఈ వ్యాఖ్యలపైనే వివాదం చోటుచేసుకుంది.