ఆంధ్రాకు వ‌చ్చిన ప్ర‌తీసారీ ఈ వివ‌ర‌ణ ఎందుకు..?

ఉప రాష్ట్రప‌తి వెంక‌య్య నాయుడు ఆంధ్రాకు వచ్చారు. రాజ‌ధాని అమ‌రావ‌తి స‌మీపంలోకి ఐన‌వోలులో వి.ఐ.టి. క‌ళాశాల భ‌వ‌నాన్ని ప్రారంభించారు. ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుతో క‌లిసి ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ గూగుల్ క‌న్నా గురువు ముఖ్య‌మ‌న్నారు. అమ‌రావ‌తి ఒక విజ్ఞాన కేంద్రంగా త‌యారౌతోందంటే కార‌ణం చంద్ర‌బాబు ముందుచూపు అన్నారు. ఆయన నాయ‌క‌త్వంలో ఎన్నో విద్యా సంస్థ‌లు రాష్ట్రానికి రావ‌డం సంతోషంగా ఉంద‌న్నారు. అమ‌రావ‌తి ఒక్క రాజ‌ధాని మాత్ర‌మే కాద‌నీ, నాలెడ్జ్ హ‌బ్, హెల్త్ హ‌బ్ గా మారుతోంద‌ని అన్నారు.

ఇక‌, తాను ఉప రాష్ట్రప‌తి అయిన‌ప్ప‌టికీ, త‌ర‌చూ ఇలాంటి కార్య‌క్ర‌మాల‌కు రావ‌డం కుద‌ర‌క‌పోయిన‌ప్ప‌టికీ ఆంధ్రాకి వ‌చ్చాన‌ని వెంక‌య్య చెప్పారు. సాధార‌ణంగా ఉప రాష్ట్రప‌తి అన్ని కార్య‌క్ర‌మాల‌కూ వెళ్ల‌ర‌నీ, వ‌జ్రోత్స‌వాలు, స్వ‌ర్ణోత్స‌వాలు వంటి ప్ర‌త్యేక సంద‌ర్భాల‌కే వెళ్తార‌న్నారు. త‌న‌కు ఇది ప్ర‌త్యేక కార్య‌క్ర‌మం కాబ‌ట్టే వ‌చ్చాన‌న్నారు. త‌న సిబ్బంది గురించి మాట్లాడుతూ.. ‘మీరు శంకుస్థాప‌న చేసిన భ‌వ‌నానికి మ‌ళ్లీ మీరే వెళ్లి ఉప రాష్ట్రప‌తి హోదాలో ప్రారంభించ‌డం అంత ఇదిగా ఉండ‌ద‌ని మావాళ్లు చెప్పారు. అయితే, ఇంత త‌క్కువ కాలంలో నిర్మాణం పూర్త‌యింది కాబ‌ట్టి ప్రారంభోత్స‌వానికి నేను వెళ్తాన‌ని వారికి చెప్పాను’ అన్నారు వెంక‌య్య‌. ఇక్క‌డికి రావ‌డానికి మ‌రో కార‌ణం ఉంద‌నీ, ముఖ్య‌మంత్రి నిర్మిస్తున్న రాజ‌ధానికి అన్ని వ‌స‌తులు, అన్ని సొగ‌బులు, అన్ని హంగులూ క‌ల్పించ‌డంలో త‌న వంతు కూడా కొంత ప్ర‌య‌త్నం చేయాల‌న్న ఉద్దేశంతో రావ‌డం జ‌రిగింద‌న్నారు. అమ‌రావ‌తిలో జ‌రుగుతున్న అభివృద్ధిని కూడా చూద్దామ‌ని వ‌చ్చాన‌ని చెప్పారు. అమ‌రావ‌తి అన్ని ర‌కాలుగా అభివృద్ధి చెందాల‌నే ఉద్దేశంతోనే తాను కేంద్ర‌మంత్రిగా ఉన్న‌ప్పుడు దాదాపు రూ. వెయ్యి కోట్లు మంజూరు చేశాన‌ని గుర్తు చేశారు. ఆ స‌మ‌యంలో త‌న‌పై ఎన్ని విమ‌ర్శ‌లు వ‌చ్చినా ప‌ట్టించుకోలేద‌నీ, అమ‌రావ‌తి నిర్మాణం దిశ‌గా అడుగు ముందుకు ప‌డాల‌ని మాత్రమే అప్పుడు ఆలోచించాను అన్నారు..

ఉప రాష్ట్రప‌తిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌రువాత‌.. రాష్ట్రానికి వ‌చ్చిన ప్ర‌తిసారీ ప్ర‌సంగంలో త‌న రాక‌కు కార‌ణాలు చెబుతారు. ఉప రాష్ట్రప‌తిగా చాలా బిజీగా ఉంటున్నా కూడా తాను వ‌చ్చాన‌నీ, ప్రోటోకాల్ లాంటి ఇబ్బందులు త‌న‌కు ఉన్నా కూడా వ‌స్తున్నాన‌ని ప్ర‌తిసారీ చెబుతారు. అంతేకాదు, గ‌తంలో కేంద్రమంత్రిగా ఉన్న‌ప్పుడు తానేం చేశాన‌నో కూడా చెప్పుకునే ప్ర‌య‌త్నం చేస్తారు. నిజానికి, ఆయ‌న ఆంధ్రాకు వ‌చ్చిన ప్ర‌తీ సంద‌ర్భంలోనూ ఎందుకొచ్చానో అనే వివ‌ర‌ణ ఇవ్వాల్సిన అవ‌స‌రం ఏముంది..? అంటే, ఈ వివ‌ర‌ణ కేంద్రానికి ఇస్తున్నారేమో అనుకోవాలి. ‘నేను ఆంధ్రాకు వెళ్ల‌డానికి ఇన్ని కార‌ణాలున్నాయి చూడండీ’ అని వారికి చెబుతున్న‌ట్టుగా అనిపిస్తోంది. ఉప‌రాష్ట్రప‌తి ప‌ద‌విలో వెంక‌య్య నాయుడు పూర్తిగా కుదురుకున్న‌ట్టే క‌దా..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.