మాటల మాంత్రికుడు అయిన కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణ విషయమై తమ ప్రభుత్వం మద్దతు ఉంటుందని అంటూనే పార్లమెంట్ లో బిల్ పెట్టాలంటే ముందుగా వెళ్లి తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు మద్దతు సంపాదించుకోమని చెప్పడం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధినేత మంద కృష్ణ మాదిగకు విస్మయం కలిగించింది. ఈ అంశమై దశాబ్దాలుగా పోరాటాలు చెబుతున్న ఆయన ఏవిధంగా అయినా సరే నరేంద్ర మోడీ ప్రభుత్వ హయాంలోనే పార్లమెంట్ లో బిల్ వచ్చేటట్లు చేయాలనే పట్టుదలతో “ధర్మ యుద్ధం” పేరుతో గత సాయంత్రం సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో భారీ బహిరంగ సభ జరిపారు.
ఉభయ తెలుగు రాష్ట్రాల నుండే కాకుంగా, తమిళ్ నాడు, కర్ణాటకల నుండి పెద్ద సంఖ్యలో మాదిగలు పాల్గొన్న ఈ బహిరంగ సభకు టి ఆర్ యస్ మినహా అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు హాజరై తమ సంఘీభావం వ్యక్తం చేశారు. యస్ సి ల వర్గీకరణకు తొలి నుండి గట్టి మద్దతు తెలుపుతున్న చంద్రశేఖర రావు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తరువాత ముఖం చాటేస్తున్నారని అంటూ కృష్ణ మాదిగ ఈ సందర్భంగా అసహనం వ్యక్తం చేశారు.
ఈ విషయమై ముఖ్యమంత్రి ని కలవడం కోసం తాను ఎన్నో విఫల ప్రయత్నాలు చేస్తున్నారని తన ఆవేదనను వ్యక్తం చేశారు. “ముఖ్యమంత్రి గారిని కలవడం కోసం కేటాయించామని ఎన్నో సార్లు కోరాను. కొందరు మంత్రుల సహాయం కూడా కోరాను. అయితే ముఖ్యమంత్రి సమయం ఇవ్వడం లేదు” అని ఆయన నిస్సహాయతను వ్యక్తం చేశారు.
వెంకయ్య నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ అంశంపట్ల సూత్రప్రాయంగా మద్దతు తెలిపారని, తమ ప్రభుత్వం హయాంలోనే ఈ బిల్ ను పార్లమెంట్ లో ప్రవేశ పెడతామని హామీ ఇచ్చారు. ఇక్కడే ఆయన ఒక మెలిక పెట్టారు. ముందుగా తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ను కలసి మద్దతు సమీకరించుకోమని కృష్ణ మాదిగ కు సలహా ఇచ్చారు. కృష్ణ మాదిగను కలవడాన్ని చంద్రశేఖర రావు దాటవేస్తున్నారని తెలిసే, రాజ్యాంగ సవరణ కోసం అన్ని రాజకీయ పార్టీలు, రాష్ట్ర ప్రభుత్వాల మద్దతు అవసరం కావడంతో “మీరు చంద్రశేఖర రావు” మద్దతు పొందవలసిందే అన్నలంటూ మాట్లాడారు. ఈ ధోరణి పలువురు మాదిగ నాయకులకే కాకుండా, ఇతర పార్టీల నాయకులకు సహితం విస్మయం కలిగించింది.
పలు రాజకీయ పార్టీలు ఈ విషయమై అవకాశం ధోరణి అవలంభిస్తున్నాయని ఆరోపిస్తూ, గతంలో అనేక ప్రభుత్వాలు ఈ విషయమై అధ్యయనానికి పలు కమిటీలు నియమించాయని, కానీ తమ డిమాండ్ నెరవేర్చలేక పోయాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సభలో అన్ని రాజకీయ పార్టీలు (టి ఆర్ యస్ మినహా) సంపూర్ణ మద్దతు తెలుపడంతో నరేంద్ర మోడీ ప్రభుత్వమైనా పార్లమెంట్ కు బిల్ తీసుకు రాగలదని ఆయన విస్వాసం వ్యక్తం చేశారు.