‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’.. ఈ రెండు సినిమాలూ వెంకటేష్ అభిమానులకు ప్రత్యేకమైనవి. ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టవు. ఈ సినిమాల్లో వెంకీ మేనరిజం, బాడీ లాంగ్వేజ్ చాలా సహజంగా కుదిరాయి. అలాంటి పాత్రల్లో మళ్లీ వెంకటేష్‌ని చూడాలన్నది అభిమానుల ఆశ. అంతేకాదు.. ఈ రెండు చిత్రాలకు కర్త, కర్మ, క్రియ అన్నీ త్రివిక్రమ్ శ్రీనివాస్. అప్పుడు రచయిత… ఇప్పుడు దర్శకుడిగా స్టార్. త్రివిక్రమ్ దర్శకుడయ్యాక వెంకటేష్ తో ఆయన ఎప్పుడు సినిమా చేస్తారా, మరో మల్లీశ్వరి, నువ్వు నాకు నచ్చావ్ అలాంటి పాత్రలు ఎప్పుడు పండిస్తారా అని ఫ్యాన్స్ అంతా చాలా ఆసక్తిగా ఎదురు చూశారు. ఆ నిరీక్షణకు ఇప్పటికి తెర పడింది.
వెంకీ – త్రివిక్రమ్ సినిమాకు ఈ రోజు కొబ్బరికాయ కొట్టారు. లాంఛనంగా ఈ చిత్రాన్ని మొదలెట్టారు. నిజానికి ‘గుంటూరు కారం’ తరవాత త్రివిక్రమ్ బన్నీతోనో, ఎన్టీఆర్ తోనో సినిమా చేయాలి. అయితే ఈ ప్రాజెక్టులు ముందుకు వెళ్లలేదు. బన్నీ సినిమా ఆగిపోవడంతో ఎన్టీఆర్ ప్రాజెక్ట్ పై ఫోకస్ చేశారు త్రివిక్రమ్. ఆ కాంబో పట్టాలెక్కడానికి కూడా కొంత సమయం పడుతుంది. ఈ గ్యాప్ లో వెంకీతో సినిమా చేసే ఛాన్స్ దొరికింది.
త్రివిక్రమ్ కోసం వెంకీ కూడా కొన్ని ప్రాజెక్టులు వదులుకొన్నారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ తరవాత ఓ సినిమాని మొదలెట్టాల్సింది. దర్శకుడికి అడ్వాన్స్ కూడా ఇచ్చారు. కానీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఊహించనంత పెద్ద విజయాన్ని అందుకొంది. అందుకే పెద్ద సెటప్ లోనే సినిమా చేయాలన్న ఆలోచనతో వెంకీ ఇంతకాలం ఆగారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ మొదలు కానుంది. 2026 వేసవిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.