ఎంత మంచి సినిమా చేశాం, ఎంత గొప్ప కథ ఎంచుకొన్నాం, ఎంత ఖర్చు పెట్టాం? ఇవన్నీ కీలకమైన విషయాలే. అయితే.. ఇవన్నీ ఒక ఎత్తు. ఎప్పుడు విడుదల చేశాం?? అనేది మరో ఎత్తు. సరైన సీజన్లో సరైన సినిమా పడితే ఎలా ఉంటుందో ఈ సంక్రాంతి సీజన్ నిరూపించింది. ఒకటా, రెండా?? మూడు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. వంద కోట్ల సినిమా ఒకటి, యాభై కోట్లు దాంటిదొకటి, రూ.పాతిక కోట్లకు దగ్గర పడుతోంది మరోటి. సంక్రాంతి సీజన్లో కాకుండా… మరో సీజన్లో విడుదలైతే ఈ సినిమాల భవితవ్యంలో పెద్ద తేడా ఏం ఉండదు గానీ, వసూళ్లలో అంతరం మాత్రం స్పష్టంగా కనిపించేది. రిలీజ్ డేట్‌కు ఉన్న ప్రాధాన్యం అలాంటిది. ఈ సంగతి వెంకటేష్‌కి బాగా తెలుసు. కానీ… ‘గురు’ సినిమా రిలీజ్ విషయంలో వెంకీ రాంగ్ స్టెప్ వేస్తున్నాడేమో అనిపిస్తోంది.
జనవరి 26న రావాల్సిన సినిమా ఇది. కొన్ని కారణాల వల్ల… అనుకొన్న డేట్ మిస్ అయ్యింది. మహా అయితే రెండు వారాల తరవాతో, నెల తరవాతో రావాలి. కానీ… ఏకంగా రెండు నెలలు వాయిదా పడింది. ఏప్రిల్‌లో ఈ సినిమాని విడుదల చేస్తామని చిత్రబృందం చెబుతోంది. సమ్మర్‌ని క్యాష్ చేసుకోవాలన్నది వెంకీ ఉద్దేశం కావొచ్చు. కానీ… ఇదీ మంచి సీజనే. ఎందుకంటే దరిదాపుల్లో పెద్ద సినిమా ఏదీ కనిపించడం లేదు. మార్చి 28న కాటమరాయుడు వస్తోంది. ఈలోగా… వచ్చేవన్నీ చిన్న సినిమాలే. కాబట్టి గురు కావల్సినన్ని థియేటర్లు దొరికేస్తాయి. సమ్మర్లో వస్తే ఆ కిక్ వేరేలా ఉంటుంది. కానీ కాటమరాయుడు, బాహుబలి నుంచి పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ సినిమాలొస్తున్నప్పుడు గురు ఎలాగూ రాదు. దానికంటే ముందో, తరవాతో విడుదల చేయాలి. అదే… ఫిబ్రవరి, మార్చిలో విడుదల చేయాలనుకొంటే.. గురుకు పోటీ లేదు. పోయిపోయి.. గట్టి పోటీ ఉన్న సీజన్లో తన సినిమాని దించుతున్నాడు. బహుశా… మార్చి పరీక్షలు ఉంటాయి కాబట్టి, తన సినిమా వసూళ్లపై ఆ ప్రభావం పడుతుందేమో అనే భయాలుండొచ్చు. అలాగైతే.. ఫిబ్రవరి నెలాఖరులోగా ఎప్పుడైనా గురుని రిలీజ్ చేయొచ్చు. కానీ.. ఏప్రిల్ వరకూ విడుదల చేసేది లేదు అంటోంది చిత్రబృందం. మరి ఈ గురువుగారి ధైర్యం ఏమిటో??