వెంకటేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘AK 47’ పై మంచి అంచనాలే ఉన్నాయి. త్రివిక్రమ్ తన స్టైల్ ని మార్చుకొని ఈ సినిమా చేస్తున్నారు. ఫ్యామిలీ కథని, యాక్షన్ డ్రామాగా మలిచే ఈ ప్రయత్నం కొత్తగా ఉంటుంన్నది చిత్రబృందం చెబుతున్న మాట. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో అనూహ్య ట్విస్ట్ చోటుచేసుకునే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి.
మొదట ఈ చిత్రాన్ని ఈ యేడాది వేసవిలో విడుదల చేద్దామనుకొన్నారు. కానీ కుదర్లేదు. ఆ తరవాత అక్టోబర్ 2న విడుదల చేయాలని ప్లాన్ చేసినట్లు ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు ఆ తేదీపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దసరా సీజన్‌ను టార్గెట్ చేసిన ఈ చిత్రం ఆ రేస్ నుంచి తప్పుకునే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
దీనికి ప్రధాన కారణంగా సినిమా నాణ్యతపై రాజీ పడకూడదనే ఆలోచన కనిపిస్తోంది. కొన్ని కీలక సన్నివేశాల విషయంలో చిత్రబృందం పూర్తి సంతృప్తి చెందలేదట. ముఖ్యంగా త్రివిక్రమ్ తనకు కావాల్సిన స్థాయి ఔట్పుట్ వచ్చే వరకు కొన్ని ఎపిసోడ్స్‌పై రీ-వర్క్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. చిన్న చిన్న మార్పులు కాకుండా, సినిమాకు మరింత బలం చేకూర్చేలా కొన్ని అంశాలను మళ్లీ పరిశీలిస్తున్నారనే మాట వినిపిస్తోంది. ఇటీవల `బ్లాస్ట్` అనే ఓ సినిమా విడుదలైంది. `ఏకే 47`కీ ఈ చిత్రానికీ దగ్గర పోలికలు ఉండడంతో కథ విషయంలో చిన్న చిన్ మార్పులు చేసి, అందుకు అనుగుణంగా సన్నివేశాల్ని రీ షూట్ చేస్తున్నారని. అందుకే చిత్రీకరణ ఆలస్యం అవుతోందని టాక్.
త్రివిక్రమ్ సినిమాల విషయంలో పరిపూర్ణతకు ఎంత ప్రాధాన్యం ఇస్తారో తెలిసిందే. అందుకే తొందరపడి రిలీజ్ చేయడం కంటే, మరికొంత సమయం తీసుకుని తాను అనుకున్న స్థాయిలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ రీ-వర్క్ కారణంగా అక్టోబర్ 2 రిలీజ్ వాయిదా పడితే, తర్వాత తేదీ ఏదన్నది ఆసక్తికరంగా మారింది. ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, దసరా విండోను మిస్ అయితే చిత్రబృందం నేరుగా 2027 సమ్మర్ సీజన్‌ను టార్గెట్ చేసే అవకాశం ఉందట. సమ్మర్లో పెద్ద సినిమాలకు ఉండే అడ్వాంటేజ్, కుటుంబ ప్రేక్షకుల నుంచి వచ్చే ఆదరణను దృష్టిలో పెట్టుకుని ఆ నిర్ణయం తీసుకునే అవకాశముందని అంటున్నారు.
అయితే ఇప్పటివరకు చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కాబట్టి ఇవన్నీ ప్రస్తుతం ఇండస్ట్రీలో జరుగుతున్న ప్రచారంగానే చూడాలి. కానీ గతంలో కూడా పెద్ద సినిమాలు చివరి నిమిషంలో రిలీజ్ డేట్లను మార్చుకున్న సందర్భాలు ఉండటంతో, ఈ వార్తలను పూర్తిగా కొట్టిపారేయలేని పరిస్థితి ఉంది. మొత్తానికి, వెంకటేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్‌పై ఉన్న అంచనాల కారణంగా ‘AK 47’ రిలీజ్ చుట్టూ జరుగుతున్న ప్రతి చర్చ కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది. దసరా రేస్‌లోనే సినిమా వస్తుందా? లేక 2027 సమ్మర్‌కు షిఫ్ట్ అవుతుందా? అన్నదానిపై క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
