రానా కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వడం ఎందుకు అని మొదట్లో ఆయన నటనను చూసి కామెంట్స్ చేసిన వాళ్ళే ఇప్పుడు… రానా కూడా తెలుగు సినిమాకు అవసరం అని అంటున్నారు. ఒక్క తెలుగు అనే కాదు హిందీలో కూడా వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ మనల్ని మెప్పిస్తున్నాడు రానా. అలాంటి మరో వైవిధ్యమైన కథతోనే త్వరలో మనముందుకు రాబోతున్నాడు. 1971లో ఇండియా-పాకిస్తాన్ యుధ్ధ సమయంలో… విశాఖపట్నాన్ని ధ్వంసం చేయాలన్న టార్గెట్‌తో బోర్డర్ దాటి వచ్చిన ‘ఘాజీ’ అనే పాకిస్తాన్ సబ్‌మెరైన్‌ని మన నావికాదళానికి చెందిన సైనికులు ఎంత వీరోచితంగా పోరాడి ధ్వంసం చేశారన్న కథతో ‘ఘాజీ’ సినిమా తెరకెక్కుతోంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం డబ్బింగ్ స్టేజ్‌లో ఉంది. తాప్సీ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. ఈ సినిమా కథను పరిచయం చేస్తూ వచ్చే వాయిస్ ఓవర్‌ని వెంకటేష్ చెప్పనున్నారట. ప్రారంభంలోనే వచ్చే ఆ వాయిస్ ఓవర్‌కి చాలా ప్రాముఖ్యత ఉందని, కొంచెం సంక్లిష్టంగా ఉండే ‘ఘాజీ’ కథలోకి ప్రేక్షకులను తీసుకెళ్ళడం కోసం ఆ వాయిస్ ఓవర్లో కాస్త ఇంట్రడక్షన్ ఇస్తే బాగుంటుందని భావించాడట డైరెక్టర్. ఆ వాయిస్ ఓవర్ కూడా ఎవరైనా ప్రముఖ నటులతో చెప్పిస్తే బాగుంటుందని అనుకున్నారు. వెంకటేష్ చేత ఆ వాయిస్ ఓవర్ చెప్పిస్తే కథకు ఉపయోగపడడంతో పాటు సినిమాకు మంచి క్రేజ్ కూడా వస్తుందని భావించి ఫైనల్‌గా వెంకటేష్ చేత చెప్పించాలని ఫిక్స్ అయింది ఘాజీ యూనిట్. సంకల్ప్ అనే ఓ కొత్త దర్శకుడు తెరకెక్కించిన ఈ సినిమా హిందీ, తెలుగు భాషల్లో ఒకేసారి రిలీజ్ కానుంది.