ఒకరు మెగాస్టార్ చిరంజీవి… మరోకరు విక్టరీ వెంకటేష్. ఇద్దరిదీ దశాబ్దాల ప్రయాణం. ఒకరంటే ఒకరికి ఇష్టం కూడా. కానీ కలిసి పని చేసే అవకాశం రాలేదు. ఇన్నాళ్లకు ‘మన శంకర వర ప్రసాదుగారు’ సినిమాలో ఇద్దర్నీ ఒకేసారి వెండి తెరపై చూసే ఛాన్స్ వచ్చింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం సంక్రాంతికి విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో వెంకీ ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈరోజుతో వెంకీకి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయ్యింది. పది రోజుల పాటు వెంకీ పై కొన్ని సన్నివేశాలు తెరకెక్కించారు. చిరు, వెంకీలపై ఓ పాట కూడా రూపొందించారు. శంకర వర ప్రసాద్ తో వెంకీ ప్రయాణం పూర్తయ్యిందంటూ అనిల్ రావిపూడి ఓ ట్వీట్ చేశారు. ఇద్దర్నీ ఒకేసారి డైరెక్ట్ చేసే అవకాశం ఇచ్చినందుకు హీరోలకు కృతజ్ఞతలు చెప్పుకొన్నారు.
చిరు కూడా ఈ సందర్భంగా వెంకీకి కృతజ్ఞతలు తెలిపారు. ప్రతీ మూమెంట్ ఎంజాయ్ చేశారని తన ట్వీట్ లో పేర్కొన్నారు. వెంకీ కూడా ఈ ప్రయాణాన్ని పూర్తిగా ఆస్వాదించానంటూ స్పందించారు. చిరు – వెంకీలపై రూపొందించిన ఈ పాట త్వరలోనే విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది. ఈ ఆల్బమ్ లోని అన్ని పాటల్లోకెల్లా ఈ పాట ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతోందని చిత్రబృందం చెబుతోంది. ఇప్పటికే ‘మీసాల పిల్ల’ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. రమణ గోగుల పాడిన మరో పాటని త్వరలోనే విడుదల చేస్తున్నారు. మరి వెంకీ – చిరుల ఆ మాస్ బీట్ ఎప్పుడు వినిపిస్తారో? నయనతార కథానాయికగా నటించిన ఈ చిత్రానికి భీమ్స్ సంగీతాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే.