హీరోయిన్లకు కొత్త కెరీర్..! రా..రమ్మంటున్న రాజకీయ పార్టీలు..!

సార్వత్రిక ఎన్నికల వేళ ప్రధాన పార్టీలకు సినీ గ్లామర్ తోడవుతోంది. సినీ నటీనటులను ఎన్నికల బరిలో దించేందుకు కాంగ్రెస్, బీజేపీలు పోటీపడుతున్నాయి. యూపీ నుంచి ఎన్నికల బరిలో జయప్రదను బీజేపీ దించితే.. ఇపుడు కాంగ్రెస్‌ ..ఊర్మిళను రంగంలోకి దించేందుకు సిద్ధమవుతోంది. రంగీలా బ్యూటీ ఊర్మిళ మటోండ్కర్‌.. పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీలో చేరారు. ఆయన ఇంటికి వెళ్లి మరీ హస్తం పార్టీ కండువా కప్పుకున్నారు. అనంతరం వారిరువురి మధ్య సీటు విషయంలో చర్చలు జరిగాయి. కాంగ్రెస్‌లో చేరిన తర్వాత ఊర్మిళ బీజేపీపై గట్టి విమర్శలే చేశారు. దేశంలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛలేదన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన కాంగ్రెస్ ఇప్పుడు స్వేచ్ఛ కోసం పోరాడుతోందన్నారు. ఆ సిద్ధాంతాలు నచ్చే తాను కాంగ్రెస్ పార్టీలో చేరారనని తెలిపారు.

ఊర్మిళను ముంబై ఉత్తర నియోజకవర్గం నుంచి బరిలోకి దింపేందుకు కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ నియోజకవర్గం బీజేపీకి కంచుకోట లాంటిది. హీరో గోవిందా కూడా.. అక్కడ్నుంచి పోటీ చేసి ఓ సారి ఓడిపోయారు. ముంబై ఉత్తర నియోజకవర్గ పరిధిలో స్టార్ హీరోలతో పాటు బాలీవుడ్ ప్రముఖులు అధికంగా ఉంటారు. అందుకే బీజేపీకి పోటీగా సినీ నేపథ్యమున్న ఉర్మిళను కాంగ్రెస్ ప్రయోగిస్తోంది. 1980లో మరాఠీ చిత్రం జాకోల్‌తో బాలనటిగా సినిమాల్లో అడుగుపెట్టిన ఊర్మిళ.. కలియుగ్ చిత్రం ద్వారా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. 1994లో రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్లో తెరకెక్కిన రంగీలా చిత్రంతో ఆమె సూపర్ హిట్ అందుకున్నారు. తెలుగులోనూ అనేక సినిమాల్లో నటించారు. అయితే హీరోయిన్‌గానే కాదు… అనేక సేవా కార్యక్రమాల్లోనూ ఆమె ముందున్నారు. ఇవన్నీ తమకు కలిసొస్తాయని కాంగ్రెస్ అంచనా వేస్తోంది.

మరోపక్క యూపీలోని రాంపూర్‌ నుంచి బీజేపీ అభ్యర్థిగా సీనియర్ నటి జయప్రద తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. గత కొంత కాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న జయప్రద కొద్ది రోజుల క్రితమే కాషాయ కండువా కప్పుకున్నారు. రాంపూర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం ఎస్పీకి కంచుకోటలాంటిది. అయితే ఎస్పీ నుంచే జయప్రద రెండు సార్లు గెలిచారు. మాధురీ దీక్షిత్‌ను కూడా.. రాజకీయాల్లోకి తీసుకు రావాలని బీజేపీ చాలా ప్రయత్నించింది. ఆమెకు పుణె టిక్కెట్ ఆఫర్ ఇచ్చింది. కానీ… మాధురీదీక్షిత్ మాత్రం.. నో చెప్పేసింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com