ఉపరాష్ట్రపతి పదవికి మోదీ, షాలు ఎవరిని ఖరారు చేస్తారో ఎన్టీఏ కూటమి పార్టీలకే కాంగ్రెస్ పార్టీకి కూడా అంతు చిక్కకుండా ఉంది. వారు పోటీ చేయాలా వద్దా కిందా మీదా పడుతున్నారు. అయితే మోదీ, షా మాత్రం గుంభనంగా తమ కసరత్తు తాము పూర్తి చేశారు . ఇప్పటికే ఎన్డీఏ పార్టీలన్నీ.. ఉపరాష్ట్రపతిగా ఎవరిని ఎంపిక చేసినా తమకు సమ్మతమే అని తేల్చేశాయి. దీంతో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశాన్ని ఆదివారం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలోనూ మోదీ , షాలు అభ్యర్థిని ఖరారు చేసే అవకాశం లేదు.
అయితే బీజేపీ పార్లమెంటరీ బోర్డు కూడా.. ఎంపిక బాధ్యతను మోదీ, షాలకే ఇచ్చే అవకాశం ఉంది. వారు అసలు పేరును సోమవారం ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఉపరాష్ట్రపతి పదవికి 21వ తేదీ వరకూ నామినేషన్లు దాఖలు చేయవచ్చు. జగదీప్ ధన్ఖడ్ రాజీనామా చేసిన తర్వాత చాలా పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. నితీష్ కుమార్ నుంచి.. వెంకయ్యనాయుడు పేరు వరకూ పరిశీలనలోకి వచ్చింది. ఇటీవల వెంకయ్యనాయుడు ప్రధాని మోదీతో కూడా భేటీ అయ్యారు.
అయితే ఎవరి పేరును ఫైనల్ చేయబోతున్నారో.. ప్రకటించిన తర్వాతే తేలుతుంది. ప్రచారంలోకి వచ్చిన పేర్లేవీ ఉండవని ఇప్పటి వరకూ జరిగిన ఇలాంటి పదవులకు ఎంపికల ప్రాసెస్లను పరిశీలిస్తే అర్థం చేసుకోవచ్చు. రాజీనామా చేసిన ధన్ఖడ్ కానీ.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేరు కానీ ఆయా పదవులకు పోటీ పడేందుకు ఖరారు చేసినప్పుడు వారి పేర్లు అసలు ప్రచారంలోకి రాలేదు. ఇప్పుడు కూడా ఉపరాష్ట్రపతిగా ఎవరూ ఊహించని అభ్యర్థిని ఖరారు చేసే అవకాశం ఉంది.