ఉపరాష్ట్రపతి ఎన్నికలు ముగిశాయి., ఫలితం అనుకున్నట్లుగానే వచ్చింది. నైతిక విజయం మాదేనని ఓడిపోయిన వాళ్లు చెప్పే డైలాగుల్ని ఇండీ కూటమి చెబుతోంది. కానీ వారికి నైతిక విజయం కూడా దక్కలేదని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి. ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్‌కు పన్నెండు మందికిపైగా ఇండీ కూటమి ఎంపీలు క్రాస్ ఓటింగ్ చేశారు. ఇప్పుడీ అంశం ఇండీ కూటమి పార్టీల మధ్య చిచ్చులకు కారణం అవుతోంది. మీ ఎంపీలటే మీ ఎంపీలని అన్ని పార్టీలు ఒకరి వైపు ఒకరు అనుమానంగా చూస్తున్నాయి.
పోటీ చేయాలనుకోవడమే వ్యూహాత్మక తప్పిదం
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి స్పష్టమైన మెజార్టీ ఉంది. పైగా పూర్తి స్థాయి పవర్ ఉంది. ఒక్కరంటే ఒక్క ఎంపీ కూడా ధిక్కరించే పరిస్థితి లేదు. కనీసం ఓ పది మందితో క్రాస్ ఓటింగ్ చేయించి నైతికగా దెబ్బకొట్టే అవకాశమూ లేదు. ఇలాంటి సమయంలో ఇండీ కూటమి పోటీ చేయాలనుకోవడమే వ్యూహాత్మక తప్పిదం. అయినా పోటీ చేశారు. తెలుగురాష్ట్రాల పార్టీలతో మైండ్ గేమ్ ఆడాలని సుదర్శన్ రెడ్డిని బరిలోకి దించారు. కానీ అంతిమ ఫలితం మాత్రం బొప్పికట్టేలా వచ్చింది.
ఇండీ కూటమిలోని పార్టీలే సీరియస్‌గా తీసుకోలేదు !
ఇండీ కూటమిలోని పార్టీలో ఎన్నికను సీరియస్ గా తీసుకోలేదు. బీజేపీతో లోపాయికారీ ఒప్పందాల కోసమో.. ఆ పార్టీని మెప్పించడానికే.. తమ ఎంపీలతో క్రాస్ ఓటింగ్ చేయించాయి. ఇలా ఎవరు చేయించారన్నది ఇండీ కూటమి నేతలకు అంతర్గతంగా తెలుసు. కానీ బయట పెట్టుకుంటే..కూటమి పతనం అవుతుంది. అందుకే.. గుంభనంగా ఉంటున్నారు. కానీ ఆర్జేడీ లాంటి పార్టీలు మేము కాదంటే.. మేము కాదని శీలపరీక్ష చేసుకుంటున్నాయి.
ఇండీ కూటమి ఐక్యత ఎప్పుడూ ప్రశ్నార్థకమే
బీజేపీని ఓడిస్తామంటూ ఇండీ కూటమి పార్టీలు హడావుడి చేస్తూంటాయి. నిజానికి ఆ పార్టీల్లోనే ఐక్యత ఉండదు. కాంగ్రెస్ పార్టీ వారిని ఏక తాటిపైకి ఉంచలేదు. ఎవరి ఆశలు.. ఆశయాలు వారికి ఉంటాయి. ఇలాంటి సమయాల్లో.. అవసరం లేని చోట అధికులమనకుండా గుంభనంగా రాజకీయాలు చేయాలి.. కానీ ఇండీ కూటమి చేసేదే అదే. అందుకే కూలీ ఇచ్చి కొట్టించుకున్నట్లుగా పరిణామాలు ఎదురవుతూ ఉంటాయి.