ఉపరాష్ట్రపతి రాజీనామా చేశారు. ఆమోదం పూర్తి అయింది. ఎన్నికల సంఘం శరవేగంగా ఎన్నిక ప్రక్రియ చేపడుతుంది. ఆరు నెలల గడువు ఈ పదవికి వర్తించదు. అంటే మరో వారంలోనే ఎన్నిక ప్రక్రియ ప్రారంభమవుతుంది . అయితే చాలా మందికి ఓ డౌట్ ఉంది. జరుగుతోంది ఉపఎన్నికలు కాబట్టి.. మిగిలిన పదవి కాలం మాత్రమే ఉంటుందా లేకపోతే.. పూర్తి పదవి కాలం ఉంటుందా అన్నదే ఆ డౌట్. ఉపఎన్నిక అయినా ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యేవారు పూర్తి కాలం అంటే ఐదు సంవత్సరాల కాలం పదవిలో ఉంటారు.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 68(2) ప్రకారం, ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ అయినప్పుడు ఆ ఖాళీని భర్తీ చేయడానికి ఉప ఎన్నిక జరుగుతుంది. ఈ ఎన్నిక ద్వారా ఎన్నికైన వ్యక్తి పూర్తి ఐదు సంవత్సరాల పదవీకాలం కోసం ఉపరాష్ట్రపతిగా కొనసాగుతారు. అంటే ఉప ఎన్నికైనా సాధారణ ఎన్నికైనా పదవీకాలం ఐదు సంవత్సరాలే ఉంటుంది. ఇది ఉపరాష్ట్రపతి పదవికి సంబంధించిన రాజ్యాంగ నిబంధన. కొత్తగా ఎన్నికైన వ్యక్తి తన పదవీకాలాన్ని ఆ రోజు నుండి ఐదు సంవత్సరాల పాటు నిర్వర్తిస్తారు. ఇది రాష్ట్రపతి ఎన్నికల మాదిరిగా కాకుండా, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఖాళీ అయిన సమయానికి సంబంధం లేకుండా పూర్తి పదవీకాలం ఉంటుంది.
జగదీప్ ధన్ ఖడ్కు ఇంకా రెండేళ్ల పదవి కాలం ఉంది. కొత్తగా ఎన్నికయ్యే వారికి రెండేళ్లే పదవి కాలం ఉంటుందని అనుకుంటున్నారు. కానీ ఐదు సంవత్సరాలు ఉంటుంది. అందుకే ఈ పదవి ఎవరిని వరిస్తుందా అన్నదానిపై విస్తృతమైన చర్చ ప్రారంభమైంది. ఇది హఠాత్తుగా జరిగిన పరిణామం కాదు.. ప్లాన్ ప్రకారమే చేశారని చెబుతున్నారు కాబట్టి .. అనూహ్యమైన పేరే తెరపైకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.