ఉపరాష్ట్రపతి ఎన్నికలు మంగళవారం జరగనున్నాయి. ఫలితంపై ఎవరికీ డౌట్ లేదు. అవకాశం లేదు అని తెలిసినా.. ఎన్నిక జరగాలన్న లక్ష్యంతో ఇండీ కూటమి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తిని పోటీకి నిలబెట్టింది. ఎన్నిక అనివార్యమయింది. ఏకగ్రీవం అయితే చాలా పార్టీలు ఊపిరి పీల్చుకునేవి. కానీ కొన్ని పార్టీలకు క్యారెక్టర్ టెస్టుగా మారింది. ముఖ్యంగా..వైసీపీ, బీఆర్ఎస్ వంటి పార్టీలకు.
ఎన్డీఏలో అనధికార భాగస్వామిగా వైసీపీ
అన్ని పార్టీల కంటే..దీన స్థితి వైసీపీది. పాతాళంలోకి నెట్టేసిన ఎన్డీఏకు ఎలా మద్దతిస్తావు జగన్ అని .. వైసీపీ కార్యకర్తలు ఆక్రోశిస్తున్నారు. ఇండీ కూటమి పార్టీలు కూడా అదే అంటున్నాయి. జగన్ కు కష్టం వచ్చిందని ఢిల్లీలో ధర్నా చేసినపుడు ఇండీ కూటమి పార్టీలన్నీ వచ్చి మద్దతు పలికాయి. కానీ జగన్ రెడ్డి వారందరికీ వెన్నుపోటు పొడిచాడు. బీజేపీ కాళ్లు పట్టుకుని వదిలి పెట్టడం లేదు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అడగక ముందే ముద్దతు ప్రకటించారు. ఇప్పుడు అందరూ.. జాతీయస్థాయిలో.. వైసీపీని అనధికారిక భాగస్వామిగా లెక్క కడుతున్నారు. పైగా జగన్ రెడ్డి… తనకు అండగా నిలిచే వర్గానికి కూడా మద్దతివ్వలేకపోతున్నారు.
తెలంగాణ బిడ్డకు మద్దతివ్వలేకపోయిన బీఆర్ఎస్
భారత రాష్ట్ర సమితిది కూడా ఇంచుమించు అలాంటి పరిస్థితే. అయితే జగన్మోహన్ రెడ్డి వంటి ఘోరమైన పరిస్థితి లేదు కాబట్టి.. కనీసం ఎన్నికను బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇది కూడా ఆ పార్టీ సోల్ ను దెబ్బతీస్తుంది. బీఆర్ఎస్ అంటే తెలంగాణ .. తెలంగాణ అంటే బీఆర్ఎస్ అని చెప్పుకుంటున్నారు. తెలంగాణ కోసం పీకలు కోసుకుంటామని ప్రచారం చేస్తున్న సమయంలో.. తెలంగాణ బిడ్డ దేశంలో రెండో అత్యున్నత పదవికి పోటీ చేస్తూంటే.. కనీసం మద్దతుగా నిలబడలేకపోతున్నారు. బీఆర్ఎస్ తెలంగాణ వాదంపై ప్రజల్లో మరింత అనుమానాలను తెచ్చిపెట్టింది. అసలే బలహీనమైన సెంటిమెంట్ పునాదుల్ని ఈ ఉపఎన్నిక మరింత బలహీనం చేసింది.
భయపడేవారికి ఇక రాజకీయ విధానాలెందుకు ?
తమకు రాజకీయంగా ముప్పు తెచ్చేది బీజేపీ కూటమేనని తెలిసినప్పుడు ఆ పార్టీలను వ్యతిరేకించలేని నిస్సహాయ స్థితికి వెళ్లిపోయినప్పుడు.. రాజకీయాలు చేయడం అనవసరం. చేసిన తప్పుడు పనుల కారణంగా .. జైలుకు పంపుతారని..బయటకు రావడం కష్టమవుతుందన్న భయంతో ఇలాంటి ఆత్మగౌరవం లేని రాజకీయాలు చేస్తున్నారు. ఇలాంటి వారి వల్ల రాజకీయాలకు చెడ్డపేరు వస్తుంది. కనీస విలువలు లేని రాజకీయం చేసి.. ప్రజల్ని ఎలా మెప్పించాలనుకుంటారో మరి. ఎలాగోలా బయట ఉంటే.. తర్వాత కుల రాజకీయాలో.. మత రాజకీయాలో చేసి.. బయటపడవచ్చని అనుకుంటూ ఉండవచ్చు. అది ప్రజల్ని తక్కువ అంచనా వేయడమే.