మాజీ మంత్రి విడదల రజనీ త్వరలో వైసీపీ ఇంచార్జ్ రేపల్లెకు బదిలీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఆమెకు సమాచారం ఇచ్చారు. చిలుకలూరిపేటలో కార్యక్రమాలు తగ్గించుకోవాలని..రేపల్లెకు వెళ్లేందుకు సిద్ధం కావాలని స్పష్టమైన సమాచారం ఇచ్చారు. దీంతో విడుదల రజనీ ఆశ్చర్యంతో పాటు అసంతృప్తికి గురయ్యారని చిలుకలూరిపేట వైసీపీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.
చిలుకలూరిపేటలో విడదల రజనీ చేసిన అరాచకాలు ఇప్పుడల్లా మాఫీ అయ్యేవి కావని..ఎప్పుడూ చర్చల్లో ఉంటాయని అందుకే ఆమె పరిస్థితి మెరుగుపడటం లేదని హైకమాండ్ కు రిపోర్టు వచ్చింది. పేటలో ఆమె ఎప్పటికీ గెలవదని.. బలమైన అభ్యర్థి కాలేరన్న అభిప్రాయం బలంగా ఉండటంతో ప్రత్యామ్నాయం చూపించాలని జగన్ సిద్ధమయ్యారని అంటున్నారు.
రేపల్లెలో ప్రస్తుతం ఈపూరు గణేష్ ఇంచార్జ్ గా ఉన్నారు.కానీ ఆయన ఎక్కడా కనిపించడం లేదు. మోపిదేవి టీడీపీలో చేరిపోయారు. అక్కడ వైసీపీకి నాయకత్వం లేకుండా పోయింది. అది బీసీల నియోజకవర్గం కావడం.. మత్స్యకార వర్గానికి చెందిన తెలంగాణ ముదిరాజ్ వర్గానికి చెందిన విడుదల రజనీ అయితే మంచి అభ్యర్థి అవుతారని వైసీపీ ఎనలిస్టులు తేల్చారు . అందుకే ఆమె బదిలీ ఖాయంగా కనిపిస్తోంది. పేట నుంచి గత ఎన్నికల్లో గుంటూరు పశ్చిమకు పంపారు..మళ్లీ పేటకు పంపారు. తర్వాత రేపల్లె. ఎన్నికల నాటికి చివరికి హ్యాండిచ్చినా ఆశ్చర్యం ఉండదని నిష్టూరమాడుతున్నారు రజనీ ఫ్యాన్స్.