రజనీకాంత్ ప్రస్తుతం ‘కూలీ’ ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్నారు. ఆ తరవాత ‘జైలర్ 2’ మొదలుకానుంది. గత ఐదారేళ్లలో రజనీ కొట్టిన నికార్సయిన హిట్టు.. ‘జైలర్’. ఆ సినిమాలో తన వయసుకు తగిన పాత్ర పోషించారు రజనీకాంత్. ఇప్పుడు ‘జైలర్`కు సీక్వెల్ వస్తోంది. ఈ సినిమాపై దర్శకుడు నెల్సన్ గత కొంత కాలంగా కష్టపడుతున్నాడు. స్క్రిప్టు వర్క్ పూర్తయ్యింది. ఇప్పుడు నటీనటుల ఎంపిక మొదలైంది. ఈ చిత్రంలో రజనీకాంత్ సరసన విద్యాబాలన్ ని ఎంచుకొన్నట్టు ఇన్ సైడ్ వర్గాల టాక్. ‘జైలర్ 1’లో రజనీ భార్యగా రమ్యకృష్ణ కనిపించారు. మరి ఇప్పుడు విద్యాబాలన్ పాత్రేమిటన్నది ఆసక్తికరం.
‘జైలర్‌లో’ మెహన్ లాల్, జాకీష్రాఫ్, శివరాజ్‌కుమార్ అతిథి పాత్రల్లో మెరిశారు. ఈసారి కూడా కొన్ని గెస్ట్ అప్పీరియన్స్‌లు ఉండబోతున్నాయి. ‘జైలర్ 2’లో బాలకృష్ణ నటించబోతున్నారన్న వార్త ఇది వరకే బయటకు వచ్చింది. ఇప్పుడు నాగార్జున కూడా కనిపించనున్నారని తెలుస్తోంది. ‘జైలర్ 2’లో నాగ్ ప్రధాన ప్రతినాయకుడిగా దర్శనమివ్వబోతున్నాడట. ‘కూలీ’లో నాగ్ ఓ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి రజనీకాంత్ తో ఆయన వెండి తెర పంచుకోబోతున్నారన్నమాట. ‘కుబేర’లో సైతం నాగ్ ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నారు.