జనసేన పార్టీలో తొలిసారిగా.. ఓ రాజీనామా మాట వినిపించింది. పార్టీకి అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్న విజయ్ బాబు వ్యక్తిగత కారణాల వల్ల జనసేనకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. విజయ్ బాబు సీనియర్ జర్నలిస్ట్. చిరంజీవికి సన్నిహితునిగా పేరు ఉంది. గతంలో కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో సమాచార హక్కు చట్టం కమిషనర్‌గా పదవి పొందారు. కొన్ని నెలల క్రితమే ఆయన జనసేనలో చేరారు. వెంటనే అధికార ప్రతినిధి హోదా ఇచ్చారు. పవన్ కల్యాణ్ సామాజికవర్గానికి చెందిన వ్యక్తే. తెలుగుదేశం పార్టీని తీవ్రంగా విమర్శించేవారిలో ముందు ఉంటారు. విజయ్ బాబు రాజీనామా వార్త.. జనసేన నేతలకు షాక్ ఇచ్చింది.
విజయ్ బాబు ఎందుకు రాజీనామా చేశారన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. జనసేనలో అంతర్గతంగా జరుగుతున్న పరిణామాలతో ఆయన మనస్థాపం చెందారని చెబుతున్నారు. ముఖ్యంగా నాదెండ్ల మనోహర్ జనసేనలో చేరినప్పటి నుంచి సీనియర్ నేతలంతా సైడైపోతున్నారు. మారిశెట్టి రాఘవయ్య దగ్గర్నుంచి పలువురు సీనియర్ నేతలు ఇప్పుడు పెద్దగా ప్రాధాన్యం లేకుండా ఉండిపోయారు. అన్ని వ్యవహారాలను.. నాదెండ్ల మనోహరే చూసుకుంటున్నారు. అదే సమయంలో.. పార్టీలో చేరికల విషయంలోనూ…. ముందూ వెనుకా చూసుకోకుండా.. అందర్నీ చేర్చుకుంటున్నారని.. తమ అభిప్రాయాలను వినడం లేదన్న అసంతృప్తి విజయ్ బాబుకు ఉందని అందుకే పార్టీ నుంచి వైదొలిగారని చెబుతున్నారు.
ప్రస్తుతానికి జనసేన పార్టీలో ప్రస్తుతం ఓ వ్యవస్థ అంటూ లేకుండా పోయింది. ఓ స్థాయి నేత ఎవరు వస్తే.. వారికి పెద్ద పీట వేస్తున్నారు. మిగిలిన వారికి ఎలాంటి ప్రాధాన్యం దక్కడం లేదు. దాంతో సహజంగానే.. ఇతరుల్లో అసంతృప్తి పెరిగిపోతోంది. ఈ విషయంలో పవన్ కల్యాణ్ .. జాగ్రత్త తీసుకుని పార్టీలో అధికారాల్ని వికేంద్రీకరించకపోతే… ముందు ముందు మరిన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదురువుతాయన్న అభిప్రాయం.. జనసేన వర్గాల్లోనే ఉంది.