తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్ చుట్టూ ఇప్పుడు సీబీఐ ఉచ్చు బిగుస్తోందన్న సంకేతాలు గట్టిగా కనిపిస్తున్నాయి. కరూర్ తొక్కిసలాట ఘటనపై సోమవారం జరిగిన ఆరు గంటల సుదీర్ఘ విచారణ కేవలం ప్రారంభం మాత్రమేనని, సంక్రాంతి పండుగ తర్వాత అసలు ప్రక్రియ మొదలవుతుందని ఇప్పటికే లీకులు వచ్చాయి. ఈ విచారణలో తన పార్టీ వైపు నుండి ఎలాంటి తప్పిదాలు జరగలేదని విజయ్ వాదించినప్పటికీ, ఆయనపై ఉన్న అభియోగాలను ధృవీకరించే బలమైన సాక్ష్యాలు తమ వద్ద ఉన్నాయనే సంకేతాలను దర్యాప్తు సంస్థలు ఇస్తున్నాయి.
బీజేపీ గేమ్ ప్లాన్ ఇదే – విజయ్ ఎలా ఎదుర్కొంటారు?
ఈ విచారణల వెనుక బీజేపీ గేమ్ ప్లాన్ స్పష్టంగా కనిపిస్తోంది. సంక్రాంతి తర్వాత జరగబోయే విచారణలో ఆయన అరెస్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయనే ఊహాగానాలు చెన్నై రాజకీయాల్లో వేడి పుట్టిస్తున్నాయి. ఇది కేవలం విచారణ మాత్రమే కాదు, విజయ్‌పై ఒత్తిడి పెంచి తమ దారిలోకి తెచ్చుకునే ఎత్తుగడగా రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. విజయ్ను అన్నాడీఎంకే, బీజేపీ కూటమిలోకి రావాల్సిందేనని ఇటీవల తమిళనాడుకు వచ్చిన అమిత్ షా .. ఆదేశాలు జారీ చేసి వెళ్లారు. దానికి తగ్గట్లుగానే తదుపరి కార్యక్రమాలు జరుగుతున్నాయని అనుకోవచ్చు.
విజయ్ లొంగుతారా?
ఇప్పుడు అందరి కళ్లు విజయ్ తీసుకునే నిర్ణయం పైనే ఉన్నాయి. సీబీఐ ఒత్తిడికి తలొగ్గి బీజేపీతో పొత్తుకు సై అంటారా? లేక మొండిగా పోరాడి జైలుకు వెళ్లడానికైనా సిద్ధపడతారా? అనేది హాట్ టాపిక్‌గా మారింది. ఒకవేళ ఆయన బీజేపీతో చేతులు కలిపితే ఎలాంటి పరిస్థితి ఏర్పడుతుందన్నది ఆసక్తికరంగా మారింది. అలా కాకుండా అరెస్టును ఎదుర్కోవాలని నిశ్చయించుకుంటే, అది ఆయనకు ప్రజల్లో సానుభూతిని తెచ్చిపెట్టవచ్చు. అయితే, బలమైన సాక్ష్యాలు ఉన్నాయని సీబీఐ నుంచి లీకులు వస్తున్న తరుణంలో విజయ్ ఈ రాజకీయ చదరంగంలో ఎలా పావులు కదుపుతారో వేచి చూడాల్సి ఉంది.
బీజేపీపై సైలెంటుగా ఉంటున్న విజయ్
తన సినిమాకు సెన్సార్ ఆటంకాలు వచ్చినా విజయ్ నోరు మెదపడం లేదు. తొక్కిసలాట కేసులో తననే విలన్ ను చేసే అవకాశం ఉందన్న విశ్లేషణలు వస్తున్నందున ఆయన బీజేపీపై నోరు మెదపడం లేదు. గతంలో సిద్ధాంతపరమైన శత్రువు అన్నారు కానీ ఇప్పుడు అది కూడా అనడం లేదు. టీవీకేలో కూడా కొంత మంది బీజేపీతో పొత్తు మంచిదేనని చెబుతున్నట్లుగా తెలుస్తోంది. డీఎంకే వంటి ప్రధాన పార్టీలను ఎదుర్కోవాలంటే కేంద్ర ప్రభుత్వ అండ ఉండాలని ఒక వర్గం భావిస్తుంటే, బీజేపీతో పొత్తు విజయ్ స్వతంత్ర అస్తిత్వాన్ని దెబ్బతీస్తుందని ఆయన సన్నిహితులు హెచ్చరిస్తున్నారు. సంక్రాంతి తర్వాత జరగబోయే పరిణామాలు తమిళ రాజకీయాల్లో పెను మార్పులకు నాంది పలకనున్నాయి.
