ఈనెల 26న ఉదయ్‌పూర్ లో విజయ్ దేవరకొండ – రష్మికల పెళ్లి అంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. ‘గీత గోవిందం’లో కలిసి నటించిన దగ్గర్నుంచి వీరిద్దరి మధ్య స్నేహం పెరిగిందని, డియర్ కామ్రేడ్ నాటికి ప్రేమలా మారిందన్న విషయం మీడియాలో కథలు కథలుగా రాస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఆ ప్రేమని పెళ్లి మండపం వరకూ నడిపిస్తోంది ఈ జంట. పెళ్లికి సంబంధించి సోషల్ మీడియాలో రకరకాల కథనాలు వస్తూనే ఉన్నాయి. పెళ్లి డేట్, రిసెప్షన్ ఎక్కడ అనేది ఫ్యాన్స్ కి కూడా తెలిసిపోయింది. శనివారం విజయ్ దేవరకొండ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. పెళ్లి పిలుపుల కోసమే రేవంత్ తో ములాఖాత్ అయ్యారన్నది బహిరంగ రహస్యం. కాకపోతే… అటు విజయ్ గానీ, ఇటు రష్మిక కానీ, వాళ్ల కుటుంబ సభ్యులు కానీ ఈ విషయంలో నోరు మెదపడం లేదు.
అభిమానులు మాత్రం అధికారిక ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు. విజయ్ – రష్మిక ఇద్దరూ ఒకే రోజు, ఒకే సమయంలో తమ ప్రేమ, పెళ్లి విషయాన్నిఅధికారికంగా ధృవీకరించి, ఆ శుభవార్తని అభిమానులతో పంచుకోవాలనుకొంటున్నారని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. పెళ్లి తరవాత హైదరాబాద్ లో ఓ రిసెప్షన్ ఏర్పాటు చేసి, అభిమానులకు కూడా ప్రత్యేక విందు ఇవ్వబోతున్నారని సమాచారం. అందుకు సంబంధించిన వేదిక కూడా సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఉదయ్ పూర్లో ఈనెల 22 నుంచి పెళ్లి హంగామా మొదలు కానుంది. 20నే కుటుంబ సభ్యులు, కొంతమంది సన్నిహితులు ప్రత్యేక విమానంలో ఉదయ్ పూర్ బయలుదేరతారని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈలోగానే విజయ్, రష్మికల నుంచి ఓ ప్రకటన వెలువడే అవకాశం ఉంది.