ఈమధ్యే వైవాహిక జీవితంలో అడుగుపెట్టాడు విజయ్‌దేవరకొండ. తన చేతిలో రెండు సినిమాలు ఉన్న సంగతి తెలిసిందే. ‘రౌడీ జనార్థన’, ‘రణబాలి’ రెండూసెట్స్ పై ఉన్నాయి. రెండూ డిఫరెంట్ జోనర్లే. ఇవి తప్ప కొత్త కథలేం ఒప్పుకోలేదు. ఇప్పుడో సినిమాపై సంతకాలు చేసినట్టు తెలుస్తోంది. దర్శకుడు శౌర్యవ్ తో విజయ్ త్వరలోనే పని చేయబోతున్నాడని టాక్. కెవిఎన్ ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది. చిరంజీవి – బాబీ కలయికలో రాబోతున్న సినిమాకు వీళ్లే నిర్మాతలు. ప్రస్తుతం కథా చర్చలు నడుస్తు్నాయి.
‘హాయ్ నాన్న’ సినిమాతో ఆకట్టుకొన్నాడు శౌర్యవ్. ఆ సినిమా మంచి విజయాన్ని అందుకొంది. ఆ తరవాత.. ఓ కథ రాసుకొని ఎన్టీఆర్ చుట్టూ తిరిగాడు. కానీ ఎందుకో వర్కవుట్ కాలేదు. మళ్లీ నానితోనే సినిమా చేద్దామని ఫిక్సయ్యాడు. కానీ నాని కూడా తన ప్రాజెక్టులతో బిజీ అయిపోయాడు. ఓ తమిళ హీరోకి కూడా కథ చెప్పిన శౌర్యవ్.. ఇప్పుడు విజయ్ దేవరకొండ దగ్గర ఆగాడు. ‘హాయ్ నాన్న’ క్లాస్ టచ్‌తో సాగే కథ. ఎమోషన్స్ కి పెద్ద పీట వేశాడు. ఈసారి మాత్రం భారీ యాక్షన్ హంగామా ఉండే స్క్రిప్టు తయారు చేసుకొన్నట్టు తెలుస్తోంది. ఈ కాంబోకి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో రాబోతోంది.
