విజయ్‌దేవరకొండని అభిమానులు ప్రేమగా ‘రౌడీ’ అని పిలుచుకొంటుంటారు. విజయ్ కూడా చాలా ఎగ్రసీవ్‌గా ఉంటాడు. ముఖ్యంగా అభిమానుల ముందుకొచ్చేటప్పుడు, మీడియాతో మాట్లాడేటప్పుడు ఆ ఎగ్రసీవ్నెస్ కనిపిస్తూ ఉంటుంది. ఫ్యాన్స్‌కి అదే ఇష్టం. అయితే అదే.. విజయ్‌కి తలనొప్పులు తెచ్చి పెట్టింది. విజయ్ ఎక్కువగా ట్రోల్ అవ్వడానికీ, తన సినిమాలు కావల్సినదానికంటే ఎక్కువ డామేజ్ అవ్వడానికి కారణం… ఆ ఆటిట్యూడే. సినిమా రిలీజ్‌కు ముందు ప్రెస్ మీట్ పెడితే – రౌడీలోని ఎమోషన్ మరింత తన్నుకొని వచ్చేది. ‘నా లెక్క రెండు వందల కోట్ల నుంచే’ అని ‘లైగర్’ ప్రమోషన్లలో చెప్పాడు రౌడీ. ‘ఫ్యామిలీ స్టార్’ కు కూడా ఇలాంటి స్టేట్మెంట్లే ఇచ్చాడు. అయితే ఆ రెండు సినిమాలూ బాగా డామేజీ చేశాయి. దాంతో కాస్త కంట్రోల్ లో పడినట్టు అర్థమవుతోంది. నిర్మాత నాగవంశీ కూడా ‘ఈసారి కాస్త నిదానించి మాట్లాడు’ అంటూ విజయ్‌ని గైడ్ చేసినట్టు ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. దానికి తగ్గట్టే విజయ్ దేవరకొండ స్పీచుల్లో చాలా మార్పు కనిపించింది. ట్రైలర్ లాంచ్‌లో, ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎక్కడా హద్దు దాటలేదు. చాలా కూల్ గా మాట్లాడాడు.
ఈరోజు జరిగిన మీడియా మీట్లో అయితే మరీనూ. ఏదో స్కూల్‌కి వచ్చిన పిల్లాడిలా బుద్ధిగా కూర్చుని, చాలా నిదానంగా, ప్రశాంతంగా జవాబులు చెప్పుకొంటూ వెళ్లాడు. సినిమా గురించి ఎక్కువ చేసి మాట్లాడలేదు. అంచనాలు పెంచేలా ఒక్క మాట కూడా తూలలేదు. ‘మనం చూస్తోంది విజయ్దేవరకొండనేనా’ అన్నంత అనుమానాన్ని క్రియేట్ చేయగలిగాడు. ఈ మార్పు ఎందుకు? అని అడిగితే… విజయ్ అప్పుడు కూడా చాలా నిదానంగా, కామ్ గా సమాధానం చెప్పాడు. తానెప్పుడూ మనసులో ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడానని, ఎవరి మెప్పుకోసమో ప్రయత్నించలేదని అంటూనే… ఈ ప్రయాణంలో చాలా మెచ్యూరిటీ వచ్చిందని, అప్పట్లో సెల్ఫ్ డిఫెన్స్ కోసం అలా మాట్లాడాల్సివచ్చిందని, తన గురించి తాను తప్ప ఇంకెవ్వరూ మాట్లాడడానికి లేరని, అందుకే తన తరపున తానే మాట్లాడాల్సివచ్చిందని చెప్పుకొచ్చాడు. తనపై వస్తున్న నెగిటివిటీని అస్సలు పట్టించుకోనని, ప్రేమని పంచేవాళ్ల గురించే తాను కేర్ తీసుకొంటానని ప్రకటించుకొన్నాడు విజయ్. ”నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవడానికి అప్పట్లో అలా మాట్లాడా. నన్నెవరూ తక్కువ చేసి మాట్లాడకూడదు. నన్ను వేలెత్తి చూపించకూడదు అనుకొనేవాడ్ని. నాకు అర్హమైనవన్నీ నాకు దొరకాలన్నదే నా తాపత్రయం. ఆ తరవాత అభిమానుల ప్రేమ వల్ల మెల్లమెల్లగా సాఫ్ట్ అవుతూ వచ్చా” అని ముక్తాయించాడు విజయ్.
విజయ్‌లో ఈ మార్పు ఊహించనిదే. బహుశా.. ఈమధ్య తగిలిన గట్టి ఎదురుదెబ్బల వల్ల కావొచ్చు. సినిమా విడుదలకు ముందు ఏం మాట్లాడినా ప్రయోజనం ఉండదని, సినిమానే మాట్లాడాలన్న నిజం తెలుసుకొని ఉండడం వల్ల కావొచ్చు. లేదంటే నిజంగానే నాగవంశీ కంట్రోల్ లో పెట్టి ఉండొచ్చు. ఇంకెంత..? మరి కొద్ది గంటల్లో ‘కింగ్ డమ్’ వచ్చేస్తుంది. ఇక విజయ్ మాట్లాడాల్సిన అవసరం లేదు. తన సినిమానే మాట్లాడాలి.