ఈమధ్య ఒకే కథని రెండు భాగాలుగా చేసి విడుదల చేయడం ట్రెండ్ గా మారింది. కథా విస్కృతి దృష్ట్యా, బడ్జెట్లు పెరిగిపోవడం వల్ల నిర్మాతలు ఈ పంథాని అనుసరిస్తున్నారు. విజయ్ దేవరకొండ నటించిన ‘కింగ్ డమ్’ కూడా రెండు భాగాలుగానే విడుదల చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. అయితే విజయ్ మాత్రం `ఇది ఒక్క సినిమానే` అనే క్లారిటీ ఇచ్చారు.
ఓ తమిళ మీడియాకు విజయ్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘కింగ్ డమ్’ రెండు భాగాలా? అనే ప్రశ్న ఎదురైంది. దీనికి విజయ్ చాలా స్పష్టమైన సమాధానం ఇచ్చారు. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తనకు ఈ సినిమా ఒకే కథలా చెప్పారని, అలాగే తీశామని, కానీ ఈ కథకు చాలా స్పాన్ ఉందని, ‘కింగ్ డమ్’కు ముందు ఏం జరిగింది? తరవాత ఏం జరగబోతోంది? ఈ కథలోని మిగిలిన పాత్రలు ఎలా ప్రవర్తిస్తాయి? అనేది చాలా విస్త్రృతమైన విషయమని, వాటి చుట్టూ భవిష్యత్తులో మరిన్ని భాగాలు వచ్చే అవకాశం ఉందని స్పష్టం చేశారు. అయితే.. ప్రతీ భాగంలోనూ తానే హీరోగా కనిపించాల్సిన అవసరం లేదని, కథని బట్టి, పాత్రని బట్టి హీరోలు మారతారని చెప్పుకొచ్చారు విజయ్. అంటే.. ‘కింగ్ డమ్’లో కీలకమైన పాత్రలు చాలా ఉన్నాయన్నమాట. సినిమా విజయవంతం అయితే పార్ట్ 2, పార్ట్ 3… ఇలా కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటికైతే `కింగ్ డమ్`లో పూర్తి కథ చూసేయొచ్చు. జులై 4న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. కాకపోతే ఈ సినిమా నిడివి దాదాపుగా 3 గంటల వరకూ ఉండే అవకాశం ఉంది. ఫైనల్ కట్ పూర్తయితే నిడివిపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.