తమిళనాడు రాజకీయాల్లో ఎంజీఆర్ ఒక యుగ పురుషుడు . ఆయనను ఆరాధించే కోట్లాది మంది ప్రజలు ఆయనలో ఒక ఆదర్శవంతమైన కుటుంబ పెద్దను, రక్షకుడిని చూసుకున్నారు. విజయ్ కూడా అదే బాటలో నడవాలని ఆశిస్తూ, ఎంజీఆర్ గెటప్‌లు, ఆయన తరహా ప్రసంగాలతో ప్రజల్లోకి వెళ్తున్నారు. కానీ, ప్రస్తుతం విజయ్ కుటుంబం చుట్టూ వినిపిస్తున్న వార్తలు ఆయన ఇమేజ్ను డ్యామేజ్ చేస్తున్నాయి. పిల్లలతోసహా కుటుంబం మొత్తాన్ని రోడ్డున పడేశారన్న ప్రచారంతో ఆయన పూర్తిగా ప్రజలకు దూరం అవుతున్నారు.
తమిళ సమాజంలో విజయ్ కుటుంబంపై చర్చ
విజయ్ భార్య సంగీత లండన్‌లో ఉంటున్నారు. కుమారుడు అద్దె ఫ్లాట్‌లో గడపడం, కుమార్తె దూరంగా ఉండటం వంటి అంశాలు తమిళ సమాజంలో చర్చనీయాంశంగా మారాయి. సొంత గూటిని చక్కదిద్దుకోలేని వాడు, రాష్ట్రాన్ని ఏం పాలిస్తాడు అనే ప్రశ్న ఇప్పుడు సామాన్యుల నోట వినిపిస్తోంది.
ప్రజాక్షేత్రంలో వ్యక్తిగతం అంటూ ఏమీ ఉండదు. ఇటీవల బహిరంగ సభలో విజయ్ నా వ్యక్తిగత సమస్యలను నేను పరిష్కరించుకుంటాను అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. అయితే, సినిమా స్టార్‌గా ఉన్నప్పుడు చెల్లుబాటు అయ్యే ఈ మాటలు, ప్రజా నాయకుడిగా మారినప్పుడు చెల్లుబాటు కావు. ప్రజలకు ప్రతీ అంశంలో జవాబుదారీాగ ఉండాలి.
కుటుంబంపైనే ప్రేమ లేదు.. ఇక ప్రజలపై ఎలా?
తమిళనాడు రాజకీయ చరిత్రను గమనిస్తే, నాయకుడి వ్యక్తిగత క్రమశిక్షణ, కుటుంబ విలువలకు ఓటర్లు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. కుటుంబ సభ్యులను బయటకు పంపించేశారనే ప్రచారం, విజయ్ పట్ల ఒక రకమైన నిర్లక్ష్య ధోరణి ఉన్న నాయకుడనే ముద్ర వేస్తోంది. ఇది కరూర్ తొక్కిసలాట వంటి పాలనాపరమైన వైఫల్యాల కన్నా ప్రమాదకరంగా మారుతోంది. తమిళనాడులో ఏ పార్టీ గెలుపునైనా డిసైడ్ చేసేది మహిళా ఓటర్లే. ఎంజీఆర్‌కు మహిళల్లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. కానీ విజయ్ విషయంలో భార్యను, పిల్లలను దూరం పెట్టారనే వార్తలు మహిళా ఓటర్లలో ప్రతికూల భావనను కలిగిస్తున్నాయి. తన రక్తం పంచుకున్న వారినే పట్టించుకోని వ్యక్తి, రేపు పాలకుడు అయితే ప్రజల కష్టాలను, ఆడబిడ్డల ఆవేదనను ఎలా అర్థం చేసుకుంటారనే చర్చ ప్రతి ఇంట్లోనూ సాగుతోంది. ఇది విజయ్ రాజకీయ ఎదుగుదలకు పెను శాపంగా పరిణమించే అవకాశం ఉంది.
నైతికత లేని రాజకీయం
రాజకీయాల్లో నైతికత అనేది కేవలం అవినీతి రహిత పాలన మాత్రమే కాదు, అది నాయకుడి నడవడికపై కూడా ఆధారపడి ఉంటుంది. విజయ్ తన రాజకీయ ప్రసంగాల్లో సిద్ధాంతాల గురించి మాట్లాడుతున్నా, ప్రజల దృష్టి మాత్రం ఆయన వ్యక్తిగత జీవితంపైనే ఉంటోంది. ప్రత్యర్థి పార్టీలు కూడా ఈ బలహీనతను ఆయుధంగా చేసుకుని, విజయ్ను ఒక బాధ్యత లేని వ్యక్తి గా చిత్రించే ప్రయత్నం చేస్తున్నాయి. ఎంజీఆర్ లాగా విజయం సాధించాలంటే కేవలం భారీ బహిరంగ సభలు సరిపోవు.. ప్రజల్లో ఉన్న ఈ నైతిక సందేహాలను పటాపంచలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
విజయ్ ఎంతగా “ఇది నా వ్యక్తిగతం” అని వాదించినా, పబ్లిక్ లైఫ్‌లోకి వచ్చాక ఆయన ప్రతి అడుగూ ప్రజల నిఘాలోనే ఉంటుంది. కరూర్ ఘటన కంటే ఈ కుటుంబ వివాదాలే ఆయనకు రాజకీయంగా పెద్ద తలనొప్పిగా మారాయి. ఈ వ్యతిరేకతను ఆయన ఎలా అధిగమిస్తారు? ప్రజల నమ్మకాన్ని తిరిగి ఎలా పొందుతారు.. అన్న దానిపైనే ఆయన ‘తమిళగ వెట్రి కళగం’ భవిష్యత్తు ఆధారపడి ఉంది.
