తమిళనాట ఒకే ఒక్క ఇన్సిడెంట్‌తో రాజకీయం ముదిరిపాకాన పడుతోంది. ఎంజీఆర్, జయలలిత తర్వాత తానే సంచలనం సృష్టిస్తానని అనుకుంటున్న విజయకు వారిలా నిలబడే శక్తి లేదని ఒకే ఒక్క ఘటన నిరూపించింది. కరూర్ తొక్కిసలాట ఘటన తర్వాత ఆయన రాజకీయ నాయకుడిగా వ్యవహిరంచలేకపోయారు. ఇప్పటికీ ఆయన భయం భయంగా ఉన్నారు. దాంతో ఇతర పార్టీలు చెలరేగిపోతున్నాయి. ముఖ్యంగా బీజేపీ ఆయన వైపు కమ్ముకొస్తోంది. ఆయన తప్పించుకోవడం సాధ్యం కాకపోవచ్చని తమిళనాట ఇప్పటికే విశ్లేషణలు ప్రారంభమయ్యాయి.
విజయ్ సైలెన్స్‌తో తప్పు ఆయనదేనని అనుకునేలా ప్రచారం
కరూర్ ఘటన జరిగిన మూడు రోజుల తర్వాత … పోలీసులు అరెస్టులు ప్రారంభించిన తర్వాత విజయ్ విడుదల చేసిన వీడియో వైరల్ అయింది. అందులో ఆయన డిఫెన్సివ్ మోడ్‌లోనే కనిపించారు కానీ సగటు రాజకీయ నాయకుడిలా ఇంకా చెప్పాలంటే… ఓ పార్టీ అధినేతలా మాట్లాడలేకపోయారు. సాధారణంగా ఇలాంటివి జరిగినప్పుడు అంతా ప్రభుత్వం కుట్ర అని విపక్షాలు రాజకీయాలు చేసి.. ఆయా బాధితులకు అండగా నిలబడతాయి. ప్రభుత్వ నిర్వహణ లోపం వల్లే ఇలాంటివి జరుగుతాయి. కానీ ఇక్కడ మాత్రం విజయ్ పై తీవ్ర వ్యతిరేక ప్రచారం జరిగింది. కానీ దాన్ని ఆయన కంట్రోల్ చేయలేకపోయారు. తొక్కిసలాట జరిగిన వెంటనే వెళ్లిపోవడం, ప్రభుత్వం వేగంగా స్పందించడం, ఏం చేయాలో విజయ్ క్లూ లెస్ గా ఉండటంతో మొత్తం ఆయనపైనే ఎక్కువగా వ్యతిరేకత వచ్చేలా చేసింది.
సీఎం సార్ అంటూ విజ్ఞప్తులు – బీజేపీకి పరోక్షంగా ధన్యవాదాలు
వీడియోలో సీఎం సార్ అంటూ విజ్ఞప్తులు చేయడం చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. ప్రభుత్వంపై నేరుగా ఆరోపణలు చేయలేకపోయారు. ప్రభుత్వ చేతకాని తనం వల్లే జరిగిందని నిందించలేకపోయారు. అప్పటికే తమ పార్టీ నేతల్ని , తనకు మద్దతుగా ఉన్న వారిని అరెస్టు చేస్తూండటంతో ఆయన కంగారు పడినట్లుగా కనిపిస్తోంది. అందుకే వారి జోలికి వెళ్లవద్దని తనను అరెస్టు చేయాలని కోరారు. కానీ అరెస్టు అవుతున్న వారందరికీ తాను అండగా ఉంటానన్న బలమైన సందేశాన్ని ఆయన తన అనుచరుల్లోకి పంపలేకపోయారు. అదే సమయంలో ఇంత కంటే మంచి రాజకీయం దొరకని బీజేపీ ఇస్తున్న మద్దతును ఆయన స్వీకరించారు. పరోక్షంగా కృతజ్ఞతలు తెలిపారు.
ఎంపీల కమిటీని పంపిన ఎన్డీఏ
తొక్కిసలాట ఘటనపై ఎన్డీఏ ఎంపీల కమిటీని పంపింది. బీజేపీ చేయాలనుకున్నంత రాజకీయం చేస్తుంది. ఇదంతా విజయ్ పై ఒత్తిడి తీసుకు రావడానికే. అయితే వ్యతిరేకంగా కాదు. మద్దతుగా. తమ కూటమిలోకి విజయ్ పార్టీకిని తీసుకు వచ్చేందుకు ఈ ఘటన బాగా ఉపయోగపడుతుందని బీజేపీ అనుకుంటోంది. అందుకే డీఎంకే ఈ ఘటనపై చర్యలు తీసుకునే సమయంలో … విజయ్ కు మద్దతుగా డీఎంకేకు వ్యతిరేకంగా బీజేపీ ముందుకొస్తోంది. ఈ మద్దతును విజయ్ కాదనలేరు. అలాగని స్వాగతించలేరు. విజయకు గడ్డు పరిస్థితే .