తమిళ సూపర్ స్టార్ విజయ్ ఇప్పుడు తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు. టీవీకే పార్టీ పెట్టి క్రమంగా క్రేజ్ పెంచుకుంటున్నానని అనుకుంటున్న సమయంలో కరూరులో జరిగిన తొక్కిసలాట ఘటనతో ఒక్క సారిగా ఆయన డిఫెన్స్‌లో పడిపోయారు. ఇలాంటి సమయమంలో ఆయనకు మద్దతుగా వచ్చే వారు పెద్దగా కనిపించడం లేదు. ముఖ్యంగా తమిళ సినీ పరిశ్రమ నుంచి ఆయనకు పెద్దగా సపోర్టు రాలేదు. ఎక్కువ మంది వ్యతిరేకంగానే స్పందించారు.
నటుడు శరత్ కుమార్ తో పాటు కట్టప్ప సత్యరాజ్ విజయ్ ను విమర్శించారు. ఈ ఘటనకు బాధ్యత తీసుకోవాల్సిందేనన్నారు. నటి ఒవియా విజయ్ ను అరెస్ట్ చేయాలన్నారు. విశాల్‌తో పాటు మరికొందరు స్పందించారు కానీ.. బాధితుల కోసమే మాట్లాడారు. విజయ్ తప్పేమీ లేదని ఓదార్పునిచ్చే ప్రయత్నం చేయలేదు. తమిళ సినీ పరిశ్రమ తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన అంశాల్లో ఏకతాటిపైకి వస్తుంది కానీ.. వారి మధ్య ఆధిపత్యపోరాటం.. గ్రూపులు ఎక్కువగానే ఉంటాయి.
సినీ పరిశ్రమ నుంచి కొంత మంది విజయ్ తో పాటు నడుస్తున్నారు. అయితే వారెవరూ.. పై స్థాయి పొజిషన్లలో ఉన్న వారు కాదు. మరో వైపు ఈ తొక్కిసలాట ఘటనలో తనను అరెస్టు చేస్తారేమో అని విజయ్ కంగారు పడుతున్నారు. అయితే ప్రభుత్వం నియమించిన విచారణ కమిటీ నివేదిక ఇచ్చే వరకూ ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశాలు కనిపించడం లేదు. ఈ లోపు విజయ్ కోసం బీజేపీ మాత్రమే ముందుకు వచ్చి మద్దతుగా మాట్లాడుతోంది.