తమిళనాడు రాజకీయాల్లో కొత్తగా అడుగుపెట్టిన స్టార్ హీరో విజయ్, తన తమిళగ వెట్రి కజగం ద్వారా ఎలాంటి వ్యూహాలు అనుసరించబోతున్నారనే దానిపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో మేనిఫెస్టో రూపకల్పన కోసం ఆయన ప్రత్యేక కమిటీని వేశారు. ప్రజల్ని ఆకట్టుకోవడానికి విజయ్ .. మిగతాపార్టీల్లాగే ఉచిత హామీల వర్షం కురిపించబోతున్నారని ఇప్పటికే సంకేతాలు వచ్చాయి.
సిద్ధాంతాలు సేమ్.. తాయిలాలూ సేమ్
డీఎంకేను రాజకీయ శత్రువుగా ప్రకటించారు విజయ్. ఆయన విధానాలన్నీ డీఎంకే తరహాలోనే ఉన్నాయి. కొత్తగా ఏమీ లేరు. ఇప్పుడు రాజకీయ వ్యూహాలు కూడా డీఎంకేను ఫాలో అయిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజకీయాల్లో మార్పు తెస్తానని ప్రకటించిన నటుడు విజయ్, ఆచరణలో మాత్రం రాష్ట్రంలో దశాబ్దాలుగా పాతుకుపోయిన తాయిలాల సంస్కృతినే కొనసాగించేలా కనిపిస్తున్నారు. మేనిఫెస్టో రూపకల్పన కోసం ఆయన వేసిన కమిటీ కసరత్తు ప్రారంభించింది. అందులో పొందుపరిచే అంశాలపై ఇప్పటికే లీకులు అందుతున్నాయి. ప్రజలను ఆకర్షించడమే లక్ష్యంగా, అధికార డీఎంకే , అన్నాడీఎంకేలను మించిపోయేలా భారీ స్థాయిలో ఉచిత హామీలను ప్రకటించడానికి విజయ్ సిద్ధమవుతున్నారు.
తాయిలాల హోరులో కొత్త పార్టీ
తమిళనాడు రాజకీయ చరిత్రను గమనిస్తే, ఏ పార్టీ గెలవాలన్నా గృహోపకరణాల నుంచి నగదు పంపిణీ వరకు రకరకాల ఉచిత పథకాలు ప్రకటించడం ఆనవాయితీగా వస్తోంది. ఇప్పుడు విజయ్ కూడా అదే బాటలో పయనిస్తున్నట్లు అర్థమవుతోంది. అందరికీ నాణ్యమైన విద్య, వైద్యం ఉచితం అనే నినాదంతో పాటు, ప్రతి గృహిణికి నెలవారీ గౌరవ వేతనం, విద్యార్థులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు వంటి హామీలను ఆయన మేనిఫెస్టోలో చేర్చే అవకాశం ఉంది. రాజకీయాల్లో కొత్త మార్పు తెస్తారని భావించిన వారికి, ఆయన కూడా అదే పాపులిస్ట్ దారిని ఎంచుకోవడం కొంత మందికి ఆశ్చర్యం కలిగిస్తోంది.
ఎవరూ ఊహించని స్థాయిలో హామీలు
ప్రస్తుత ప్రచారాన్ని బట్టి చూస్తే, అధికార పార్టీ ఇస్తున్న ఉచితాల కంటే రెట్టింపు స్థాయిలో విజయ్ హామీలు ఉండబోతున్నాయని సమాచారం. ముఖ్యంగా మహిళా ఓటర్లు , యువతను ఆకట్టుకోవడానికి సరికొత్త తాయిలాలను ఆయన కమిటీ సిద్ధం చేస్తోంది. కేవలం సిద్ధాంతాలు చెబితే ఓట్లు రాలవని గ్రహించిన విజయ్, ప్రజల ఆర్థిక అవసరాలను క్యాష్ చేసుకునే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. గతంలో ఎంజీఆర్, జయలలిత వంటి వారు అనుసరించిన సంక్షేమ పథకాల వ్యూహాన్ని మరింత ఆధునికీకరించి ప్రజల ముందుకు తేవాలని ఆయన యోచిస్తున్నారు.
భిన్నమైన వ్యూహం ఏదీ?
కొత్త తరం ఓటర్లు విజయ్ పార్టీ నుండి ఒక కొత్త రాజకీయ విధానాన్ని ఆశించారు. కానీ, క్షేత్రస్థాయి పరిస్థితులను చూస్తుంటే.. ప్రజలకు ఉచితాలు ఎర వేసి అధికార పీఠాన్ని దక్కించుకునే పాత పద్ధతిలోనే ఆయన ప్రయాణం సాగబోతోంది. అధికార డీఎంకే అవినీతిని ప్రశ్నిస్తూనే, మరోవైపు తాను కూడా భారీ ఖర్చుతో కూడిన హామీలు ఇవ్వడం ద్వారా విజయ్ తమిళనాడు రాజకీయ ట్రెండ్‌ను మార్చడం లేదని, దానికి మరిన్ని హంగులు అద్దుతున్నారని స్పష్టమవుతోందన్న నిట్టూర్పు వినిపిస్తోంది.