వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తాజా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన తన మిర్చి పంటకు పురుగుమందులు కొడుతున్నారు. సూటు, బూటు ధరించి ఢిల్లీ వేదికగా రాజకీయ చక్రం తిప్పే స్థాయి నుంచి, నేడు తన ఫామ్‌హౌస్‌లో సాదాసీదా రైతులా మారి మిర్చి పంటకు పురుగు మందులు పిచికారి చేస్తున్న దృశ్యాలు నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.
లిక్కర్ స్కాంలో ఇటీవల ఈడీ ఎదుట హాజరైనప్పుడు తాను మళ్లీ రాజకీయాల్లోకి ఘనంగా పునరాగమనం చేస్తానని ప్రకటించారు. దానికో టైమ్ లైన్ కూడా ప్రకటించారు. అప్పట్లో ఆయన మాటలు చూసి విజయసాయిరెడ్డి ఇక దూకుడు పెంచుతారని అందరూ భావించారు. కానీ, ఆ చాలెంజ్ తర్వాత ఆయన మళ్ళీ సైలెంట్ అయిపోయారు.
గతంలో ఆయన సొంతంగా ఒక మీడియా ఛానల్‌ను ప్రారంభించబోతున్నట్లు స్వయంగా ప్రకటించారు. ప్రత్యర్థులకు దీటుగా సమాధానం చెప్పేందుకు, తన వాయిస్‌ను బలంగా వినిపించేందుకు ఈ మీడియా సంస్థను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అయితే, ఆ ఛానల్ ఎప్పుడు ప్రారంభమవుతుంది? అసలు ఆ ప్రయత్నాలు ఏ దశలో ఉన్నాయి? అనే విషయాలపై ఇప్పటివరకు క్లారిటీ లేదు.
అంతన్నారు.. ఇంతన్నారు కానీ చివరికీ ఏదీ చేయకుండా తాను వ్యవసయం చేసుకుంటున్నట్లుగా ఎందుకు వీడియోలు రిలీజ్ చేస్తున్నారో కానీ.. విజయసాయిరెడ్డిది ఖాళీగా ఉండే బ్రెయిన్ కాదని.. ఆయన ఏదో చేస్తారని రాజకీయవర్గాలు గట్టిగానే నమ్ముతున్నాయి.


