వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఒకప్పటి అత్యంత ఆప్తుడు, పార్టీ ఆవిర్భావం నుండి నీడలా నిలిచిన విజయసాయిరెడ్డి ఇప్పుడు జగన్‌కు దూరమయ్యారు. తాను దూరం కాలేదని జగనే దూరం చేశారని.. ఆయన కోటరీ మాటల్ని నమ్మి తనకు వెన్నుపోటు పొడిచారని అంటున్నారు. అయితే విజయసాయిరెడ్డి .. తనను దూరం పెట్టారు కాబట్టి ఇక దూరమైపోతానని అనుకోవడం లేదు. కోటరీ సంగతి తేల్చి అయినా మళ్లీ జగన్ రెడ్డి దగ్గరకు చేరాలనుకుంటున్నారు. అందుకే వింత వింత ప్రకటనలు చేస్తున్నారు.
జగన్‌పై ఈగ వాలనీయనని కలరింగ్
ఈడీ విచారణ తర్వాత విజయసాయిరెడ్డి ప్రెస్‌మీట్ చూస్తే.. జగన్ పై తనకున్న విధేయతను చాటుకుంటూనే, తనను ఆయనకు దూరం చేసిన కోటరీ పై ఆయన యుద్ధం ప్రకటించారనిఅర్థంచేసుకోవచ్చు. అంటే ఆయన లక్ష్యం ఒక్కటే.. జగన్ చుట్టూ ఉన్న అడ్డుగోడలను కూల్చివేసి, మళ్లీ ఆయన్ను నేరుగా చేరుకోవడం. ఈ క్రమంలో ఆయన పంపుతున్న సంకేతాలు అటు పార్టీలోనూ, ఇటు రాజకీయ వర్గాల్లోనూ పెను సంచలనం రేపుతున్నాయి. నేరుగా కోటరీనే టార్గెట్ చేస్తున్నా.. ఆయన మాటల్లో చాలా అంతర్గత అంశాలు ఉన్నాయి. అప్రూవర్ గా మారడం దగ్గర నుంచి బీజేపీలో చేరడం వరకూ చాలా టాపిక్స్ ఉన్నాయి.
కోటరీని దూరం చేస్తేనే విజయసాయిరెడ్డికి చాన్స్
జగన్ చుట్టూ ఉన్న కొందరు వ్యక్తులు పార్టీని ముంచేస్తున్నారని, వారి స్వప్రయోజనాల కోసమే జగన్‌ను తప్పుదోవ పట్టిస్తున్నారని విజయసాయిరెడ్డి నేరుగా చెబుతున్నారు. కూటమిని విడగొడితే తప్ప జగన్ గెలవలేరని.. ఆ పని తాను చేస్తానని కోటరీలోని వాళ్లు చేయలేరని చెబుతున్నారు. తనను జగన్ దగ్గరకు రానివ్వకుండా మధ్యలో ఉన్న కొందరు కావాలనే అడ్డుపడుతున్నారని, వారు దోచుకుంటున్న వైనాన్ని జగన్ గుర్తించడం లేదని ఆయన ఆవేదన చెందుతున్నారు.
ఇదే సమయంలో విజయసాయిరెడ్డి నుంచి వస్తున్న మరో హెచ్చరిక చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ జగన్ తనను కాదని, తన మాట వినకుండా ఆ కోటరీని నమ్మితే.. తనకు అప్రూవర్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయనే పరోక్ష సంకేతాలను ఆయన పంపుతున్నారు. దీనికి లింక్‌గా బీజేపీలో చేరుతానన్న హెచ్చరికలు కూడా పంపుపుతున్నారు.
జగన్ దగ్గరకు రానివ్వకపోతే వి. సా.రెడ్డి రాజకీయమే వేరు
విజయసాయిరెడ్డి ఎంతగా ప్రయత్నిస్తున్నా, జగన్ మాత్రం ప్రస్తుతానికి తన చుట్టూ ఉన్న కోటరీపైనే నమ్మకంతో ఉన్నట్లు కనిపిస్తోంది. గతంలో పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు వెన్నంటే ఉన్న సాయిరెడ్డిని జగన్ ఎందుకు దూరం పెట్టారో కేడర్‌కు అంతుచిక్కడం లేదు. అయితే, తాడేపల్లి ప్యాలెస్‌లో కోటరీని దూరం పెట్టకపోతే తాను కఠిన నిర్ణయాలు తీసుకుంటానని విజయసాయిరెడ్డి సంకేతాలు పంపుతున్నారు. సాయిరెడ్డి పంపుతున్న సంకేతాలను జగన్ సీరియస్‌గా తీసుకుంటే పార్టీకి మేలు జరుగుతుందని కొందరు అంటుంటే, జగన్ ఎవరి ఒత్తిళ్లకు లొంగరని మరికొందరు వాదిస్తున్నారు. జగన్ దగ్గరకు రానివ్వకపోతే విజయసాయిరెడ్డి రాజకీయంలో 2.0 మరో రేంజ్ లో ఉంటుంది.
