తమిళనాడులో జన నాయగన్ సినిమా సెన్సార్ బోర్డు నుంచి క్లియరెన్స్ లభించడంలో జరుగుతున్న ఆలస్యం రాజకీయ రంగు పులుముకుంది. ఈ వివాదంపై ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ కూడా విజయ్ సినిమాకు మద్దతుగా మాట్లాడారు. కేంద్రం సెన్సార్ బోర్డు ద్వారా భావప్రకటన స్వేచ్ఛను అణచివేయడం సరికాదని వ్యాఖ్యానించారు. కళాకారుల సృజనాత్మకతకు అడ్డుకట్ట వేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ఆయన పేర్కొన్నారు.
ఒక సినిమా సెన్సార్ విషయంలో జరుగుతున్న జాప్యం వెనుక కేంద్ర ప్రభుత్వ పెద్దల హస్తం ఉండవచ్చనే అనుమానాలను డీఎంకే వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. విజయ్ సినిమాకు మద్దతుగా దాదాపుగా ఇండస్ట్రీ అంతా మాట్లాడుతోంది. అయితే విజయ్ మాత్రం మౌనం పాటిస్తున్నారు. సాధారణంగా సినిమా సమస్యలపై లేదా రాజకీయ ప్రాధాన్యం ఉన్న అంశాలపై సోషల్ మీడియాలో చురుగ్గా స్పందించే విజయ్, తన సినిమా సెన్సార్ చిక్కుల్లో పడ్డా స్పందించ లేదు. తాను మాట్లాడటం వల్ల సమస్య మరింత పెరుగుతుందని …పరిష్కారం అయ్యే వరకూ సైలెంట్ గా ఉండటం మంచిదని అనుకుంటున్నట్లుగా కనిపిస్తోంది.
జననాయగన్ కొత్త సినిమా కాదు. తెలుగు సినిమాలకు రీమేక్ అని ప్రచారం జరుగుతోంది. ఆ సినిమాలపై ఎలాంటి వివాదాలు రానప్పుడు జననాయగన్కు ఎందుకు అన్న ప్రశ్న వస్తోంది. తమిళనాడు పొత్తుల రాజకీయంలో విజయ్ ను టార్గెట్ చేసుకుని ఆ సినిమాను విడుదల కాకుండా చేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో విజయ్ కు సానుభూతి పెరుగుతోంది. కానీ ఆయన స్పందించడం లేదు. సినిమా రిలీజ్ అయ్యాక స్పందిస్తారేమో చూడాల్సి ఉంది.
