తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్ అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నైలోని పెరంబూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు గట్టిగా వినిపిస్తోంది. చెన్నై నగరంలో అత్యంత కీలకమైన ఈ నియోజకవర్గంలో కార్మిక వర్గం, మధ్యతరగతి ఓటర్లు ఎక్కువగా ఉంటారు. విజయ్ సినిమాలకు ఇక్కడ ఉండే భారీ మాస్ ఫాలోయింగ్, పార్టీకి ఉన్న బలమైన క్యాడర్ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ స్థానాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. రాజధాని నగరం నుంచే తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టి రాష్ట్రవ్యాప్తంగా సానుకూల సంకేతాలు పంపాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం.
విజయ్ కేవలం అభిమానుల అంచనాలపైనే కాకుండా, పక్కాగా శాస్త్రీయ సర్వేల ఆధారంగా తన నియోజకవర్గాన్ని ఖరారు చేస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ తరపున నియమించుకున్న ప్రత్యేక బృందం గత కొన్ని నెలలుగా రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి పరిస్థితులను బేరీజు వేసింది. పెరంబూర్‌లో అన్ని వర్గాల ప్రజల మద్దతు విజయ్‌కు లభించే అవకాశం ఉందని, ఇక్కడ గెలుపు అవకాశాలు 90 శాతానికి పైగా ఉన్నాయని సర్వే నివేదికలు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అందుకే ఈ స్థానంపై ఆయన మొగ్గు చూపుతున్నారు.
అదే సమయంలో పెరంబూర్ నియోజకవర్గంలో సభ్యత్వ నమోదు ప్రక్రియ ఊహించని స్థాయిలో జరగడం, స్థానిక ప్రజల నుంచి వస్తున్న విశేష స్పందన విజయ్‌లో నమ్మకాన్ని పెంచింది. ఈ ఉత్సాహాన్ని గెలుపుగా మార్చుకోవడానికి క్షేత్రస్థాయిలో బూత్ కమిటీలను కూడా ఇప్పటికే సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇది డీఎంకే కూటమికి బలమైన నియోజకవర్గం. గత రెండు ఎన్నికల్లో డీఎంకే అభ్యర్థులు యాభై వేలకుపైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. విజయ్‌కు ఇక్కడ పోటీ చేయడం అసలైన సవాల్ అన్న అభిప్రాయం కూడా ఉంది.
