తమిళ సూపర్‌స్టార్ జోసెఫ్ విజయ్ తమిళగ వెట్రి కళగం పార్టీ 2026 అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతోంది. తమిళనాట ఒంటరిగా పార్టీలు అధికారంలోకి వచ్చిన చరిత్ర లేదు. జయలలిత అయినా.. కరుణానిధి అయినా కూటములుగానే అధికారంలోకి వచ్చారు. అందుకే ఇప్పుడు విజయ్ ఏ కూటమిలో భాగం అవుతారు…తానే ఓ కూటమిని పెట్టగలరా అన్న ప్రశ్నలు వస్తున్నాయి.
TVK 2024 ఫిబ్రవరి 2న ఏర్పడింది. విజయ్ ఫ్యాన్ క్లబ్‌లు విజయ్ మక్కల్ ఇయక్కం 2011లో AIADMK అలయన్స్‌కు మద్దతు ఇచ్చాయి. అప్పట్లో విజయ్ పార్టీ పెట్టలేదు. ఆ తర్వాత నుంచి రాజకీయంగా తన ఆలోచనల్ని విజయ్ బయట పెడుతున్నారు. చివరికి నాయకత్వ శూన్యత ఉందనుకున్న తర్వాత ఇప్పుడుపార్టీ పెట్టిరంగంలోకి దిగారు. అన్నాడీఎంకేతో పొత్తు ప్రయత్నాలు జరిగినా.. ఆ పార్టీ బీజేపీతో కలిసి వెళ్తోంది. దీంతో విజయ్ ఒంటరిగా మిగిలిపోయారు.
టీవీకే డ్రావిడియన్ సిద్ధాంతాలు, తమిళ జాతీయత, సామాజిక న్యాయం, లౌకికవాదాన్ని మిక్స్ చేసి ముందుకు సాగుతోంది. నిజానికి ఈ భావజాలం.. డీఎంకే, అన్నాడీఎంకేలదే. కొత్తగా ఏమీ లేదు. అందుకే భావజాలం ప్రకారం ఆయన కొత్త ఓటు బ్యాంకును సృష్టించుకోవడం కష్టం. పొత్తులు ఉంటేనే ఎంతో కొంత కలసి వస్తుందని అనుకుంటున్నారు. ప్రధాన పార్టీలు లేకపోతే.. తన నేతృత్వంలో చిన్న పార్టీలతో కలిసి పోటీ చేయాలనుకుంటున్నారు. VCK, PMK, DMDK, NTK లాంటి పార్టీలతో చర్చలు జరుపుతున్నారు. ఈ పార్టీలు ఇప్పటికే కొన్ని డీఎంకే తో సన్నిహితంగా ఉంటున్నాయి. మరికొన్ని అన్నాడీఎంకే కూటమితో ఉన్నాయి.
విజయ్ వైపు ప్రజలు ఉన్నారు.. ఆయనకు కొద్దిగా అయినా అవకాశం ఉంది అని అనిపిస్తే.. ఆయనతో పొత్తులు పెట్టుకునేందుకు చిన్న పార్టీలు వస్తాయి. ఇప్పటికైతే అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. సినీ క్రేజ్ వల్ల ఆయన సభలకు జనం వస్తారని దాన్ని రాజకీయం బలం అనుకోలేమన్న భావన ఎక్కువగా ఉంది.
