ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విజయా డెయిరీ అంటే కేవలం ఒక బ్రాండ్ మాత్రమే కాదు, అది నమ్మకానికి మరో పేరు. అయితే రాష్ట్ర విభజన అనంతరం రాజకీయ ప్రయోజనాల కోసం ఈ ప్రతిష్టాత్మక బ్రాండ్‌ను ఏ విధంగా పణంగా పెట్టారో తెలిపే లీజు కుంభకోణన్ని తెలంగాణ నేత గుత్తా అమిత్ రెడ్డి బయటపెట్టారు.
ప్రభుత్వ డెయిరీని ప్రైవేటు శక్తులకు ధారాదత్తం చేసిన వైనం దీని ద్వారానే వెలుగులోకి వచ్చింది.
బ్రాండ్‌ను ఎవరైనా లీజుకిస్తారా? వైసీపీ సర్కార్ ఇచ్చేసింది !
ఒకప్పుడు దక్షిణ భారతదేశంలోనే మేటి డెయిరీగా వెలుగొందిన ఏపీ విజయా డెయిరీ , గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. స్వయం సమృద్ధిగా సాగాల్సిన ఈ ప్రభుత్వ సంస్థను, లాభాల బాటలో నడిపించాల్సింది పోయి.. ఏకంగా బ్రాండ్ నేమ్‌ను ప్రైవేటు కంపెనీలకు లీజుకు ఇచ్చేయడం వెనుక పెద్ద స్కామ్ ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా మేఘనా ఫుడ్స్ అనే ప్రైవేటు సంస్థకు విజయా బ్రాండ్ పేరును వాడుకునే వెసులుబాటు కల్పించడం ద్వారా అసలైన నాణ్యత గాలికి వదిలేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
విజయా బ్రాండ్ తో కల్తీ సరుకు అమ్మకం
ఈ లీజు ఒప్పందంలో అత్యంత విస్తుగొలిపే అంశం ఏమిటంటే.. విజయా డెయిరీ ఉత్పత్తుల పేరుతో కల్తీ పదార్థాలు అమ్మడం. ఈ విషయం బయటపడటంతో ఇప్పుడు లీజు విషయం వెలుగులోకి వచ్చింది. విజయా బ్రాండ్‌ను లీజుకు తీసుకున్న మేఘనా ఫుడ్స్ సంస్థకు ఆనాటి అధికార పార్టీలోని కీలక నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. నాణ్యతా ప్రమాణాలను పాటించకుండా, విజయా పేరుతో నాసిరకం ఉత్పత్తులను మార్కెట్లోకి వదిలారు. దీని ప్రభావం పక్క రాష్ట్రమైన తెలంగాణలోని విజయా డెయిరీపై కూడా పడటంతో, అక్కడ ఛైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి లాంటి వారు తీవ్ర స్థాయిలో స్పందించాల్సి వచ్చింది.
తెలంగాణ విజయాపై పడుతున్న నీడ
తెలంగాణలో విజయా బ్రాండ్‌ను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోంది. కానీ, ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో నలిగిపోతున్న విజయా బ్రాండ్ ఉత్పత్తుల వల్ల వస్తున్న కల్తీ వార్తలు, సామాన్య ప్రజల్లో గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. రెండు రాష్ట్రాల బ్రాండ్ పేరు ఒకటే కావడంతో, ఏపీలో జరుగుతున్న ఈ లీజు కుంభకోణం తెలంగాణ డెయిరీ ప్రతిష్టను కూడా దెబ్బతీస్తోంది. ప్రభుత్వ ఆస్తులను కారుచౌకగా ప్రైవేటు పరం చేసి, ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టిన ఈ వ్యవహారంపై ఇప్పుడు విచారణ జరపాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది.
