తల్లికి రాసిచ్చిన సరస్వతి పవర్ ఆస్తులను హైదరాబాద్ ఎన్సీఎల్టీలో కేసు వేసి… గిఫ్ట్ డీడ్ గా ఇచ్చిన వాటిని రద్దు చేసుకుని వెనక్కి తీసుకునేలా ఉత్తర్వులు తెచ్చుకున్న జగన్మోహన్ రెడ్డికి పరిస్థితులు కలసి రావడం లేదు. చెన్నై ఎన్సీఎల్టీలో విజయమ్మ ఈ తీర్పును సవాల్ చేశారు. విచారణలో యథాతథ స్థితిని అమలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ కొనసాగనుంది. ఇప్పటికి అయితే సరస్వతి పవర్లో 0.25 శాతం మినహా అంతా విజయమ్మ పేరు మీదనే ఉంటుంది.
విజయమ్మపై పగబట్టిన జగన్
రాజకీయంగా షర్మిల విబేధించి సొంత పార్టీ పెట్టుకున్నారు. మొదట తెలంగాణలో.. ఆ తర్వాత ఏపీలో రాజకీయాలు చేస్తున్నారు. అదే సమయంలో విజయమ్మను తన పార్టీ గౌరవాధ్యక్షురాలి పదవి నుంచి తొలగించారు. తాడేపల్లి నివాసంలో కూడా విజయమ్మను ఉండనివ్వలేదు.దాంతో ఆమె షర్మిల వద్ద ఉంటున్నారు. అయితే తన మాట కాదని..తనకు వ్యతిరేకంగా రాజకీయాలు చేస్తారా అని జగన్ ఇద్దరిపై పగను పెంచుకున్నారు. గతంలో చేసుకున్న ఆస్తుల ఒప్పందాల ప్రకారం ఆస్తులు పంచడం ఆపేశారు. తల్లికి రాసిచ్చిన సరస్వతి పవర్ వాటాలను వెనక్కి తీసుకోవాలని ఎన్సీఎల్టీకి వెళ్లారు.
గిఫ్టుగా ఇచ్చి వెనక్కి తీసుకుంటామనే వాళ్లు ఉంటారా?
పెళ్లికో.. పుట్టినరోజు వేడుకకో వెళ్లి ఓ గిఫ్టు ఇస్తారు. తర్వాత వాడితో గొడవలు వచ్చాయని..తన గిఫ్ట్ తనకు ఇచ్చేయాలని ఎవరైనా అడుగుతారా?. జగన్ మాత్రం అడుగుతారు. ఇప్పుడు కేసు అలాంటిదే. తల్లికి రాసిచ్చిన షేర్లను .. ఆమెపై ప్రేమ తగ్గిపోయిందని.. గిఫ్ట్ డీడ్ రద్దు చేసుకుంటానని హైదరాబాద్ ఎన్సీఎల్టీలో కేసు వేశారు. అక్కడ నిర్ణయాధికారికి ఏం అర్థం అయిందో కానీ.. జగన్ కే ఆస్తులు తిరిగి ఇచ్చేయాలని తీర్పు ఇచ్చారు. ఇది అన్యాయంగా ఉందని.. ఎక్కడా చట్టాన్ని పట్టించుకోలేదని చెన్నై ఎన్సీఎల్టీలో సవాల్ చేశారు.
జగన్ మనస్థత్వాన్ని ప్రజల ముందు పెడుతున్న కేసు
నిజానికి సరస్వతి పవర్ అనేది అక్రమాస్తి. వైఎస్ సీఎం అయ్యాక అడ్డగోలుగా దోచుకున్న ఆస్తుల్లో అదీ ఒకటి. ఈడీ అటాచ్ లో ఉంది కూడా. సిమెంట్ పరిశ్రమ పెడతామని వందల ఎకరాలు చాలా తక్కువకు కొనుగోలు చేశారు. ఇంత కాలం అయినా ఏమీ పెట్టలేదు.కానీ ఆస్తులు అలాగే ఉన్నాయి. అందుకే అ కంపెనీలోషేర్ల కోసం రోడ్డున పడ్డారు. జగన్ రెడ్డి ఘోరమైన వ్యక్తిత్వం ప్రజల ముందు బయటపడింది. కానీ తల్లిపై అన్యాయం ఏ కొడుకూ గెలవలేదని.. ఆయనకు అనుభవమయ్యే అవకాశాలు ఉన్నాయి.