విజయసాయిరెడ్డి మీడియా రంగంలోకి వస్తున్నట్లుగా ప్రకటించారు. త్వరలోనే తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఒక డిజిటల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఏ రాజకీయ పార్టీకి కొమ్ముకాయకుండా, కేవలం ప్రజల పక్షాన నిలబడి, వాస్తవాలను వెలికితీస్తామని ఆయన హామీ ఇచ్చారు. ముఖ్యంగా సామాన్యులు, రైతులు, మహిళలు , యువత ఎదుర్కొంటున్న వాస్తవ సమస్యలను హైలైట్ చేయడమే ఈ ప్లాట్‌ఫామ్ లక్ష్యమని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం డిజిటల్ ప్లాట్‌ఫామ్‌గా ప్రారంభించి, అది విజయవంతమైన తర్వాత పూర్తిస్థాయి తెలుగు శాటిలైట్ న్యూస్ ఛానల్‌ను కూడా లాంచ్ చేయాలనేది తన విజన్ అని విజయసాయిరెడ్డి వెల్లడించారు.
వైసీపీలో ఉన్నప్పటి నుంచే.. ఆయన మీడియా చానల్ గురించి ప్రకటిస్తున్నారు. వైసీపీ నుంచి బయటకు వచ్చాక కూడా చెప్పారు. అయితే నేరుగా న్యూస్ చానల్ ప్రారంభించడం కన్నా డిజిటల్ అయితే ఖర్చు తక్కువని ఆయన బావించినట్లుగా ఉన్నారు. తన వాదన వినిపించుకోవడానికి ఆయనకు సాక్షి ఉపయోగపడలేదు. అందుకే సొంత చానల్ పెట్టాలనుకుంటున్నారు. త్వరలో మళ్లీ రాజకీయ ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్న ఆయన మీడియా అండ ఉండాలని గట్టిగా డిసైడయ్యారు.
విజయసాయిరెడ్డికి డబ్బులకు కొదవా ఉండదు. ఆయన ఒక్క మాటతో లిక్కర్ స్కామ్ నిందితుడికి అరబిందో నుంచి వంద కోట్ల అప్పు ఇప్పించగలరు అంటే ఆయన పలుకుబడి ఎలాంటిదో చెప్పాల్సిన పని లేదు. వైఎస్ సీఎం అయిన తర్వాత వి.సారెడ్డి కాకపోయినా ఆయన బలగం అంతా ఓ ఆర్థిక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడంలో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు ఆ డబ్బులతో ఆయన ఎలాంటి మీడియా సామ్రాజ్యాన్ని నిర్మిస్తారో చూడాల్సి ఉంది.
