విజయసాయిరెడ్డి ఆడిటర్. ఎలాంటి లెక్కలు ఎలా వేస్తే తనకు కావాల్సిన సమాధానం వస్తుందో ఆయనకు తెలుసు. రాజకీయాల్లోనూ ఆ ఆడిటర్ తెలివితేటలు చూపిస్తున్నారు. రాజకీయంగా దెబ్బతిన్నారో.. తిన్నట్లుగా నటిస్తున్నారో కానీ ఆయన ఇప్పుడు పవన్ కల్యాణ్‌కు దగ్గరయ్యేందుకు ఆయన భావజాలాన్ని అందుకుంటున్నారు. పనిలో పనిగా బీజేపీది కూడా అదే కాబట్టి ఆయన ఒక్క దెబ్బకు రెండు పిట్టలు కొట్టి తన పాత పాపాలన్నీ వెంటాడకుండా జాగ్రత్త పడుతున్నారు.
ఆలయాల నిర్వహణకు సనాతన ధర్మ బోర్డు ఉండాలన్నది పవన్ డిమాండ్. ఇప్పుడు అదే డిమాండ్ ను విజయసాయిరెడ్డి వినిపిస్తున్నారు. హిందూ దేవాలయాలపై ప్రభుత్వ నియంత్రణ సమస్యకు పరిష్కారం చూపాలని అంటున్నారు. ఇతర మతాల సంస్థలు పూర్తి స్వయంప్రతిపత్తితో పనిచేస్తున్నాయి, అయితే హిందూ దేవాలయాలు ప్రభుత్వ నిర్వహణ బోర్డుల ద్వారా నిర్వహిస్తున్నారని.. ఇది ఆర్టికల్ 14 కింద వ్యతిరేకమని అంటున్నారు. అందుకే ప్రభుత్వ నియంత్రణ నుంచి తప్పించాలని అంటున్నారు.
ఇటీవలి కాలంలో పవన్ కల్యాణ్ కు తాను అభిమానిని అన్నట్లుగా ఆయన మాట్లాడుతున్నారు. తనకు చాలా మిత్రుడని..గతంలో ఆయనను తాను ఎప్పుడూ విమర్శించలేదని.., ఇక ముందు కూడా విమర్శించనని అంటున్నారు. కానీ ఆయన గతం చాలా మురికిగా ఉంటుంది. జగన్ ను మెప్పించడానికి పవన్ ను ఎన్ని మాటలన్నారో సోషల్ మీడియా ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూనే ఉంటుంది. అటు పవన్ , ఇటు బీజేపీకి దగ్గరయ్యేందుకు విజయసాయి రెడ్డి స్కెచ్ వేస్తున్నారని సులవుగా అర్థమవుతుంది. ఇది ఆయన ఆపరేషన్ లో భాగమా లేకపోతే.. సర్వైవింగ్ టాక్టిక్నా అన్నది తేలాల్సి ఉంది.
