తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో ‘ విజయశాంతి అడుగులు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. సైలెంట్‌గా ఎమ్మెల్సీ పదవిని దక్కించుకున్న ఆమె, ఇప్పుడు కేబినెట్ బెర్త్ కోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నట్లు సమాచారం.
తెలంగాణ రాష్ట్ర కేబినెట్ విస్తరణ వార్తలు జోరందుకున్న వేళ, ఎమ్మెల్సీ విజయశాంతి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే, పదవుల కేటాయింపులో జరుగుతున్న ఆలస్యంపై ఆమె కొంత అసంతృప్తితో ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. గతంలో ఆమె రాజ్యసభ సీటును ఆశించినప్పటికీ, అధిష్టానం కేవలం ఎమ్మెల్సీ పదవితోనే సరిపెట్టిందని ఆమె భావిస్తున్నారట. తాజాగా తన సన్నిహితుల వద్ద మంత్రి పదవి ఎప్పుడు ఇస్తారు అనే అంశంపై ఆమె మనసులో మాట బయటపెట్టినట్లు తెలుస్తోంది.
2025 మార్చిలో పెద్దగా రేసులో లేకపోయినా కాంగ్రెస్ తరపున ఎమ్మెల్సీగా జాబితాలో చోటు సంపాదించారు. కేవలం సభకే పరిమితం కాకుండా, ప్రభుత్వంలో కీలక బాధ్యతలు చేపట్టాలని ఆమె ఆశిస్తున్నారు. ముఖ్యంగా సామాజిక సమీకరణాలు, మహిళా కోటాలో తనకి మంత్రి పదవి దక్కుతుందని ఆమె ధీమాగా ఉన్నారు. అందుకే ఇప్పుడు సైలెంట్ మోడ్ నుంచి బయటకు వచ్చి, తన వాయిస్ వినిపించేందుకు సిద్ధమవుతున్నారు.
రాష్ట్రంలో కేబినెట్ విస్తరణపై స్పష్టత లేకపోవడంతో, నేరుగా కాంగ్రెస్ అధిష్టానంతోనే తేల్చుకోవాలని విజయశాంతి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. త్వరలోనే ఆమె ఢిల్లీకి వెళ్లి ఏఐసీసీ అగ్ర నేతలను కలిసే అవకాశం ఉంది. తన సుదీర్ఘ రాజకీయ అనుభవం, ఉద్యమ కాలం నాటి చరిష్మాను గుర్తు చేస్తూ మంత్రి పదవి కోసం లాబీయింగ్ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. కేవలం ఎమ్మెల్సీగా ఉండటం వల్ల ప్రజలకు సేవ చేసే అవకాశం తక్కువగా ఉంటుందని, మంత్రిగా ఉంటేనే పార్టీకి, ప్రభుత్వానికి మైలేజ్ వస్తుందని ఆమె తన వాదనను వినిపించనున్నట్లు తెలుస్తోంది. విజయశాంతి ఎమ్మెల్సీ పదవిని తెచ్చుకున్న వైనం చూస్తే.. మంత్రి అయినా ఆశ్చర్యపోవాల్సింది లేదని కాంగ్రెస్ వర్గాలు సెటైర్లు వేసుకుంటున్నాయి.
