హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ అభివృద్ది మొత్తం ఎక్కువగా ఐటీ కారిడార్ ఆ చుట్టుపక్కలే ఉంది. కానీ హాట్ ప్రాపర్టీలు మాత్రం హైదరాబాద్ చుట్టూ ఉన్నాయి. అలాంటి వాటిలో ఒకటి కుంట్లూరు. విజయవాడ హైవేలో హయత్ నగర్‌కు సమీపంలో ఉండే ఈ ప్రాంతం చాలా కాలంగా రియల్ ఎస్టేట్ హబ్ గా ఉంది. ఐదారేళ్ల కిందట వరకూ అక్కడ స్థలాలు మాత్రమే అమ్మేవారు. ఇప్పుడు ఇళ్లు, గేటెడ్ కమ్యూనిటీలు పెరిగిపోతున్నాయి. హైదరాబాద్‌లోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇప్పటికీ కుంట్లూరులో ధరలు కాస్త తక్కువగా ఉన్నాయి.
ఔటర్ రింగ్ రోడ్ కుంట్లూరుకు సమీపంలోనే ఉంది. హయత్ నగర్ వరకూ మెట్రో వస్తే ఇక అభివృద్ధికి పట్టపగ్గాలుండవు. విద్య, వైద్య సౌకర్యాలు మెరుగ్గా ఉన్నాయి. ప్రస్ుతం కుంట్లూరులో అరవై లక్షలకు డబుల్ బెడ్ రూం లభిస్తోంది. స్థానిక బిల్డర్లు అమ్మే అపార్టుమెంట్లు నలభై ఐదు నుంచి యాభై లక్షలకు వస్తున్నాయి. ఇండిపెడెంట్ ఇళ్లు .. రెండు వందల గజాల స్థలంలో కోటి వరకూ పలుకుతోంది. గతంలో నాలుగైదు వేలకు గజం స్థలం అమ్మేవారు. ఇప్పుడు అది పాతిక వేలకు దాటిపోయింది.
హెచ్ఎండీఏ అనుమతులు ఉన్న వాటిని మాత్రమే కొనుగోలు చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. కుంట్లూరు వైపు ప్రభుత్వ భూములు కూడా ఎక్కువగానే ఉంటాయి. అయితే పూర్తి స్థాయి అనుమతులతో ఉన్న వెంచర్ల విషయంలో మాత్రం ఎలాంటి సమస్య ఉండదని భావిస్తున్నారు. ఓ వైపు పెరగాల్సినంత రియల్ ఎస్టేట్ పెరిగినందున తర్వాత దశలో విజయవాడ వైపు హైదరాబాద్ విస్తరిస్తే.. కుంట్లూరు హాట్ ప్రాపర్టీగా మారిపోతుంది.