తమిళనాడు రాజకీయాల్లో ప్రస్తుతం విజయ్ వర్సెస్ సెన్సార్ బోర్డు వివాదం హాట్ టాపిక్‌గా మారింది. విజయ్ నటించిన చివరి సినిమా జననాయగన్ సెన్సార్ సర్టిఫికేట్ విషయంలో ఎదురవుతున్న అడ్డంకులు కోలీవుడ్‌లో పెను దుమారాన్ని రేపుతున్నాయి. రాజకీయ కారణాలతోనే కావాలని ఈ సినిమాను అడ్డుకుంటున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో జోరందుకుంది. ఈ వివాదంతో విజయ్‌కు మరింతగా సానుభూతి పెరుగుతోంది.
జననాయగన్ కు ప్రజల సానుభూతి
తమిళగ వెట్రి కజగం అధినేత విజయ్ నటిస్తున్న జననాయగన్ సినిమా జనవరి 9న విడుదల కావాల్సి ఉండగా, సెన్సార్ బోర్డు నుంచి సర్టిఫికేట్ రాకపోవడంతో వాయిదా పడింది. ఇప్పటికే సినిమా చూసిన ఎగ్జామినింగ్ కమిటీ U/A సర్టిఫికేట్ సిఫార్సు చేసినప్పటికీ, చివరి నిమిషంలో బోర్డు ఛైర్మన్ దీనిని రివైజింగ్ కమిటీకి పంపడం వివాదానికి దారితీసింది. సాయుధ దళాల చిత్రణ, మతపరమైన అంశాలపై వచ్చిన అనామక ఫిర్యాదుల సాకుతో ఈ జాప్యం చేస్తున్నారని చిత్ర యూనిట్ కోర్టును ఆశ్రయించింది.
స్టాలిన్ వ్యూహాత్మక మద్దతు – పరిశ్రమ సంఘీభావం
విజయ్ను రాజకీయంగా దెబ్బతీయడానికే అధికార డీఎంకే అడ్డుకుంటోందని సోషల్ మీడియాలో విమర్శలు రావడంతో, ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ అప్రమత్తమయ్యారు. మేము ఏ సినిమాను అడ్డుకోము, సృజనాత్మక స్వేచ్ఛకు మేము వ్యతిరేకం కాదు అని నిరూపించుకోవడానికి ఆయన విజయ్‌కు పరోక్షంగా మద్దతు తెలిపారు. సెన్సార్ బోర్డు కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నందున, ఇది కేంద్రం చేస్తున్న రాజకీయమని డీఎంకే నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు, తమిళ చిత్ర పరిశ్రమ మొత్తం విజయ్ వెనక నిలబడింది. జయం రవి, శివకార్తికేయన్,శింబు వంటి నటులతో పాటు పలువురు నిర్మాతలు సినిమాను సినిమాగా చూడాలని, రాజకీయ కక్షలకు వాడుకోకూడదని ట్వీట్లు చేస్తూ సంఘీభావం ప్రకటిస్తున్నారు.
పొలిటికల్ ప్రయోజనం తెచ్చి పెడుతున్న సినిమా
మద్రాస్ హైకోర్టు సింగిల్ బెంచ్ ఈ వివాదంపై స్పందిస్తూ, తక్షణమే సెన్సార్ సర్టిఫికేట్ జారీ చేయాలని ఆదేశించింది. అయితే, సెన్సార్ బోర్డు దీనిపై వెంటనే అప్పీల్‌కు వెళ్లడం గమనార్హం. ఈ పరిణామాలన్నీ విజయ్‌పై ప్రజల్లో భారీగా సానుభూతినిపెంచుతున్నాయి. కేవలం నటుడిగానే కాకుండా, రాజకీయ నేతగా ఎదుగుతున్న తరుణంలో ఆయనను అణగదొక్కాలని చూస్తున్నారనే భావన సామాన్య ప్రజల్లో బలపడుతోంది. ఇది సినిమాకు మరింత బజ్ తీసుకువస్తోంది. కలెక్షన్లు ఇతర అంశాలను పక్కన పెడితే… ఏ ఉపయోగం కోసం ఈ సినిమా తీసుకుని ఆ ఉపయోగం సినిమాకు సమస్యలు రావడం వల్లనే వస్తోంది. విజయ్‌కు అలా కలసి వస్తోంది అంతే.
