అవసరమైతే తిరిగి రాజకీయాల్లోకి వస్తానని విజయసాయిరెడ్డి శ్రీకాకుళంలో భారీ ప్రకటన చేశారు. అక్కడ రెడ్డిక సంక్షేమ భవనానికి పెద్ద ఎత్తున విరాళం ఇచ్చారు. ఆ భవనం పనుల ప్రారంభోత్సవానికి వెళ్లారు. అక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన పవన్ కల్యాణ్‌ను పొగిడేందుకు ప్రయత్నించారు. పవన్ కళ్యాణ్ తో నాకు 20 ఏళ్ల స్నేహ బంధం ఉందని చెప్పుకొచ్చారు. నేను ఏ రోజూ పవన్ కళ్యాణ్ ను ఒక్క మాట అనలేదు, భవిష్యత్తులో కూడా అనను.. ఇది నా దృఢ సంకల్పమన్నారు.
తాను నేను రాజకీయాలకు దూరంగా ఉన్నానని.. ప్రస్తుతం ఏ పార్టీలో చేరే ఉద్దేశం లేదు, నాకు ఏ పార్టీ నుంచి ఆహ్వానం రాలేదని చెప్పుకొచ్చారు. జగన్ రెడ్డిపై గతంలోలాగే కోటరీ ఆరోపణలు చేశారు. కొన్ని విషయాల్లో తనపై తీవ్ర ఒత్తిడి ఉన్నా తలొగ్గడం లేదన్నారు. తాను ఇప్పుడు ప్రస్తుతం రైతునేనని చెప్పుకుంటున్నారు. విజయసాయిరెడ్డిని ఏ పార్టీ పిలవడం లేదు కానీ.. ఆయన రెడీ అన్న సంకేతాలు పంపుతున్నారు.
అవసరం అయితే రాజకీయాల్లోకి వస్తానని చెబుతున్నారు.. ఎవరికి అవసరం అన్నది మాత్రం చెప్పడం లేదు. జగన్ రెడ్డికి అవసరం అయినప్పుడా.. లేకపోతే.. తనకు అవసరం అయినప్పుడా అన్నది ఆయన క్లారిటీగా చెప్పాల్సింది. ఆయనేమీ ప్రజా నాయకుడు కాదు. మాస్ పవర్ ఉంది కాబట్టి ఎలాగోలా ఆయనను పార్టీలోకి తీసుకుంటే ఎన్నో కొన్ని ఓట్లు కలసి వస్తాయని చెప్పుకోవడానికి లేదు. అందుకే జగన్ అవసరం అయినప్పుడు ఆయన మళ్లీ రాజకీయాల్లోకి వస్తారని అనుకోవచ్చు.