లిక్కర్ సొమ్మును భారతి సిమెంట్స్ ఖాతాల్లో పంపింగ్ చేయించుకున్న వ్యవహారం వెలుగులోకి రావడంతో వైసీపీ మీడియా టోన్ హఠాత్తుగా మారిపోయింది. భారతి సిమెంట్స్ అన్న పేరే వైసీపీ మీడియా, సోషల్ మీడియాల్లో రావట్లేదు. వికాట్ గ్రూప్ అంటున్నారు. వికాట్ గ్రూపులో సోదాలు…వికాట్ గ్రూపుపై లిక్కర్ స్కామ్ ఆరోపణలు అంటున్నారు. భారతి అనే పేరు లేకుండా చేసుకున్నారు. ఎందుకంటే.. తమకు సంబంధం లేదని అది వేరే కంపెనీ అని చెప్పుకోవడానికి గ్రౌండ్ రెడీ చేసుకున్నారన్నమాట.
భారతి సిమెంట్స్ లో వికాట్ గ్రూప్ కు 51 శాతం వాటా
జగన్ రెడ్డి రఘురాం సిమెంట్స్ అనే పేపర్ల మీద ఉన్న కంపెనీని అణాకాణీలకు కొనేసి.. పెద్ద ఎత్తున భూముల్ని లీజుకు తీసుకుని.. ఫ్యాక్టరీ కట్టేశారు. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు ఇలాంటి ఐడియాలు జగన్ కు చాలా వచ్చాయి. పెట్టుబడులతో చాలామంది క్యూలో నిల్చున్నారు. అలా పెట్టుబడులు పెట్టిన వారి డబ్బుతో భారతి సిమెంట్స్ కట్టేశారు. డబ్బులు పెట్టిన వారికి చాలా చిన్న మొత్తం వాటా ఇచ్చారు. ఉత్పత్తి ప్రారంభం కాక ముందే.. వికాట్ గ్రూపు 51శాతం వాటాను వికాట్ గ్రూపుకు అమ్మేసి.. రెండు వేల కోట్లను విదేశాల నుంచి తీసుకొచ్చుకున్నారు.
పేరుకే వికాట్ గ్రూప్ .. అంతా భారతి పెత్తనమే
సాధారణంగా మెజార్టీ వాటాను తీసుకున్న కంపెనీ.. రీ బ్రాండింగ్ చేసుకుంటుంది. యాజమాన్య హోదాలో తమ వారిని పెట్టుకుంటుంది. కానీ భారతి సిమెంట్స్ లో మాత్రం భిన్నం. 51 శాతం వాటా కొని.. రూ. రెండు వేల కోట్లను .. అప్పనంగా బదిలీ చేసేసి.. సైలెంట్ అయిపోయింది. రికార్డుల్లో మాత్రమే వికాట్ అని కనిపిస్తుంది. అంతా భారతి హవానే. డైరెక్టర్ల బోర్డులో ఇద్దరు, ముగ్గురు విదేశీయుల పేర్లుంటాయి. వారెవరో ఎవరూ చూసి ఉండరు. మొత్తం ప్లాంట్, వ్యాపారం, లాభాలు అన్నీ భారతినే చూసుకుంటారు. అసలు ఈ వికాట్ ఎందుకు రెండు వేల కోట్లిచ్చిందన్నది కూడా ఇప్పటికీ మిస్టరీనే.
సమస్య వచ్చే సరికి వికాట్ గ్రూప్
వికాట్ గ్రూపులో లిక్కర్ సొమ్ము వెళ్లిందని అంటున్నారు కాబట్టి.. ఫ్రాన్స్ నుంచి ఆ గ్రూపు యాజమాన్యాన్ని పిలిపించి అసలు కథేందో బయటకు తెస్తే నాటి రెండు వేల కోట్ల పెట్టుబడుల లింక్ కూడా బయటకు వచ్చే అవకాశం ఉందని కొంత మంది సూచిస్తున్నారు. దోపిడీకి అలవాటుపడిన జగన్ దానికి కార్పొరేట్ మార్గాలను అన్వేషించారు. ఆయన అవినీతి అక్రమాలు ఎదురుగా ఉన్నా సరే.. న్యాయవ్యవస్థలో ఉన్న లొసుగులు, ప్రజలు ఇచ్చిన అధికారంతో ఎదురుదాడి చేశారు. ఇప్పుడు అన్నీ పోయాయి. అయినా ..తాను బయటపడేందుకు చేయాల్సిన అన్నీ ప్రయత్నాలూ చేస్తున్నారు.