రివ్యూ: విక్ర‌మ్‌

TELUGU360 RATING : 2.5/5

క‌మ‌ల్ ఓ ప్ర‌యోగ‌శాల‌. అంద‌రూ న‌డిచే దారిలో ఎప్పుడూ న‌డ‌వ‌డు. అది చాలాసార్లు క‌లిసొచ్చింది. కొన్నిసార్లు మింగుడు ప‌డ‌ని ఫ‌లితాల్నీ అందించింది. కాక‌పోతే… స‌గ‌టు సినీ అభిమానిని ఎప్పుడూ క‌మ‌ల్ నిరాశ ప‌ర‌చ‌లేదు. కొన్నిసార్లు క‌థ‌ని చెప్ప‌డంలో విఫ‌ల‌మైనా సాంకేతికంగా అంద‌మైన‌, అద్భుత‌మైన సినిమాల్ని అందించాడు. కొన్నిసార్లు ఫ్లాపులొచ్చినా.. కొత్త త‌ర‌హా క‌థ‌ల్ని ఇచ్చాడు. ప్ర‌తీసారీ ఓ కొత్త క‌మ‌ల్ ని ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం చేస్తూ వ‌చ్చాడు. అందుకే క‌మ‌ల్ సినిమా వ‌స్తోందంటే, ఓ న‌మ్మ‌కం.. ఓ గౌర‌వం క‌లుగుతాయి. `విక్ర‌మ్‌`పైనా ఇలాంటి అంచ‌నాలు. ఈసారి ఇంకాస్త ఎక్కువ‌గా. ఎందుకంటే.. ఖైది లాంటి న్యూ జోన‌ర్ ఫిల్మ్ అందించిన లొకేష్ క‌న‌గ‌రాజ్ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. న‌ట‌న‌లో క‌మ‌ల్ తో పోటీ ప‌డ‌గ‌లిగే.. ఫ‌హ‌ద్ ఫాజిల్, విజ‌య్ సేతుప‌తి ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌లు పోషించారు. అందుకే విక్ర‌మ్ పై ప‌దింద‌ల ఆస‌క్తి మొద‌లైంది. మ‌రింత‌కీ ఈ విక్రమ్ ఎలా ఉన్నాడు? ఏం చేశాడు?

పోలీస్ డిపార్ట్మెంట్ లో కీల‌క‌మైన వ్య‌క్తులు వ‌రుస‌గా హ‌త్య‌కు గుర‌వుతుంటారు. ఆ వీడియోల‌ను ఓ ముసుగు ముఠా.. పోలీసుల‌కు చేర‌వేస్తూ, స‌వాల్ విసురుతుంటుంది. అలా… పోలీసుల‌తో పాటుగా క‌ణ్ణ‌న్ (క‌మ‌ల్ హాస‌న్‌) అనే సాధార‌ణ వ్య‌క్తి ని కూడా హ‌త్యని కూడా హ‌త్య చేస్తుంది ఆ ముఠా. ఈ కేసుల్ని ప‌రిశోధించ‌డానికి అమ‌ర్ (ఫ‌హ‌ద్ ఫాజిల్) రంగంలోకి దిగుగాడు. త‌న టీమ్‌తో ఇన్వెస్టిగేష‌న్ మొద‌లెడ‌తాడు. ఈ క్ర‌మంలో.. క‌ణ్ణ‌న్‌కి సంబంధించిన కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు వెలుగులోకి వ‌స్తాయి. ఈ హ‌త్య‌ల‌కూ.. సంతానం (విజ‌య్ సేతుప‌తి)కీ లింకు ఉంద‌న్న సంగతి తెలుస్తుంది. అస‌లింత‌కీ క‌ణ్ణ‌న్ ఎవ‌రు? సంతానం స్థాయేంటి? ఈ కేసుల చిక్కుముడి ఎప్పుడు ఎక్క‌డ వీడింది? వీరంద‌రికీ `విక్ర‌మ్‌`కి ఉన్న సంబంధం ఏమిటి? అనేది మిగిలిన క‌థ‌.

ఓ థ్రిల్ల‌ర్‌కి కావ‌ల్సిన అన్ని హంగులూ ఈ క‌థ‌లో ఉన్నాయి. అందులో డౌటే లేదు. పోలీస్ డిపార్ట్ మెంట్ ని టార్గెట్ చేసిన ఓ ముఠా.. వ‌రుసగా హ‌త్య‌లు చేయ‌డం, డిపార్ట్మెంట్‌కి స‌వాల్ విస‌ర‌డం… దాంతో క‌థ మొద‌ల‌ద‌వుతుంది. తొలి సన్నివేశాల్లోనే హీరోని చంపేయ‌డం..క‌త్తిమీద సాము. అలాంటి సీన్ రాసుకొని మిగిలిన క‌థ ఎలా చెబుతాడు? ఎంత చెబుతాడు? అనే ఆస‌క్తి మొద‌ల‌వుతుంది. క‌మ‌ల్ మ‌ళ్లీ తెర‌పై క‌నిపిస్తాడ‌న్న సంగ‌తి ప్రేక్ష‌కుడికి అర్థ‌మ‌వుతూనే ఉంటుంది. కానీ ఎప్పుడు? ఎలా? అనేదే ట్విస్టు. ఆ ట్విస్టు కోసం ప్రేక్ష‌కులు ఇంట్ర‌వెల్ వ‌ర‌కూ ఎదురు చూడాల్సివ‌స్తుంది. ఈ లోగా.. అమ‌ర్ చేసే ఇన్వెస్టిగేష‌న్ కాస్త ఉత్కంఠ‌త‌ని రేకెత్తించింది. క‌ణ్ణ‌న్‌కి సంబంధించిన ఒక్కొక్క విష‌యం తెలుసుకొంటూ వెళ్తే.. అక్క‌డ మ‌రో విష‌యం రివీల్ అవ్వ‌డం.. స్క్రీన్ ప్లే ప‌రంగా బాగుంది. సంతానం పాత్ర‌ని కూడా గంభీరంగా ప‌రిచ‌యం చేశారు. సినిమా అంతా ఒకే ఫేజ్ లో సాగుతుంది. స‌బ్ ట్రాకులు ఉండ‌వు. కాబ‌ట్టి ఫోక‌స్ అంతా క‌థ‌పై పెట్టొచ్చు. అయితే.. లెంగ్తీ సీన్లు. ప్ర‌తీ స‌న్నివేశాన్నీ డిటైల్డ్ గా చెప్పాల‌న్న త‌ప‌న‌.. స్క్రీన్ ప్లే వేగాన్ని త‌గ్గించాయి. నిజానికి ఇలాంటి క‌థ‌ల్ని ఎంత త్వ‌ర‌గా పూర్తి చేస్తే అంత మంచిది. కానీ.. ద‌ర్శ‌కుడు ఈ విష‌యాన్ని ప‌క్క‌న పెట్టాడు.

ఇంట్ర‌వెల్ బ్యాంగ్… క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌కు తీసిపోన‌ట్టుగా డిజైన్ చేశాడు. నిజానికి.. ఇంట్ర‌వెల్ లో క‌మ‌ల్ ఎంట్రీ ఇస్తాడ‌న్న సంగ‌తి ప్రేక్ష‌కుడు ముందే ఊహిస్తాడు. అయిన‌ప్ప‌టికీ.. క‌మ‌ల్ ఎంట్రీ ఫ్యాన్స్‌కి న‌చ్చ‌తుంది. ద్వితీయార్థంలో హీరో – విల‌న్ ల వేట మొద‌ల‌వుతుంది. అక్క‌డక్క‌డ కొన్ని ట్విస్టులు ఉన్నా.. అవి స‌రిపోలేదు. ముఖ్యంగా ఏజెంట్ టీనా ఎంట్రీ అంద‌రికీ షాక్ కి గురి చేస్తుంది. ఇలాంటి ట్విస్టులు ఇంకొన్ని ఉండుంటే.. సెకండాఫ్ గ్రాఫే మారిపోయేది.

ఖైదీ అనేది క‌ల్ట్ సినిమా. ఆ సినిమాతోనే లోకేష్ కి మంచి పేరొచ్చింది. అయితే ఆ సినిమా రిఫ‌రెన్సుల్ని విక్ర‌మ్‌లో ఎడా పెడా వాడేశారు. కొన్ని చోట్ల ఆ ట్రిక్కు ఫ‌లించింది. ఇంకొన్ని చోట్ల ఎందుకిలా? అనిపిస్తుంది. చివ‌ర్లో క‌మ‌ల్.. పెద్ద మిష‌న్ గ‌న్ ప‌ట్టుకొని యుద్ధానికి దిగ‌డం.. `ఖైది`ని జ్ఞ‌ప్తికి తెచ్చే సీనే. అంతేకాదు.. పెళ్లిలో బిరియానీ వండ‌డం చూపించి `ఖైదీ`లోని బిరియానీ సెంటిమెంట్ ని ఈ సినిమాలోనూ రిపీట్ చేశాడు ద‌ర్శ‌కుడు. సూర్య ఎంట్రీ అభిమానుల‌కు న‌చ్చుతుంది. కానీ అది కూడా.. `కావాల‌ని ఇరికించారు` అనిపించేలా ఉంది త‌ప్ప‌.. క‌థ‌లో భాగంగా వ‌చ్చిన‌ట్టు లేదు. ఆ స్థానంలో కార్తినిచూపించి, ఖైదీ 2కి హింట్ ఇచ్చుంటే బాగుండేది. ఫ‌స్టాఫ్ అంతా ఫ‌హ‌ద్ ఫాజిల్ హ‌వా క‌నిపిస్తుంది. అప్పుడు క‌మ‌ల్ సైలెంట్ గా ఉంటాడు. ద్వితీయార్థంలో క‌మ‌ల్ యాక్టీవ్ అవ్వ‌గానే, ఫ‌హ‌ద్ సైలెంట్ అయిపోయాడు. విజ‌య్ సేతుప‌తి లాంటి యాక్ట‌ర్ సైతం.. చివ‌ర్లో బేల‌గా మారిపోవ‌డం, హీరోతో త‌న్నులు తిన‌డానికే ఆ పాత్ర ఉంద‌న్న‌ట్టు చూపించ‌డం.. మైన‌స్ పాయింట్‌. దాదాపుగా మూడు గంట‌ల సినిమా ఇది. ట్రిమ్ చేసుకోవాల్సిన సన్నివేశాలు చాలానే క‌నిపిస్తాయి. అవ‌న్నీ గ‌మ‌నించి మ‌రో అర‌గంట సినిమాకి క‌త్తెర వేసుంటే.. మ‌రింత వేగం వ‌చ్చేది.

క‌మ‌ల్ లాంటి న‌టుడి గురించి ఈరోజు కొత్త‌గా చెప్పేది ఏముంది..? త‌న పాత్ర‌కు త‌గ్గ‌ట్టు, వ‌య‌సుకు త‌గ్గ‌ట్టు.. చాలా హుందాగా, ప‌ద్ధ‌తిగా, స్టైలీష్‌గా చేసుకుంటూ వెళ్లాడు. రొమాన్స్‌, త‌న స్టైల్ కామెడీ లేకుండా జాగ్ర‌త్త ప‌డ‌డం న‌చ్చుతుంది. ఫ‌హ‌ద్ తొలి స‌గంలో బాగా యాక్టీవ్ గా క‌నిపించాడు. ఈ సినిమాలో త‌నే హీరోనేమో అనే భ్రమ క‌లుగుతుంది. ఇన్వెస్టిగేష‌న్‌లో త‌న య‌గ్ర‌సీవ్‌నెస్ బాగా న‌చ్చుతుంది. విజ‌య్ సేతుప‌తి ఎంట్రీకి ఎక్కువ విజిల్స్ ప‌డ్డాయి. త‌న ప‌రిచ‌య స‌న్నివేశాన్ని బాగా తీశాడు ద‌ర్శ‌కుడు. అయితే క్ర‌మంగా ఆ పాత్ర గ్రాఫ్ త‌గ్గుతూ వెళ్తుంది.

అనిరుథ్ కి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇవ్వ‌డానికి చ‌క్క‌టి వేదిక దొరికింది. చాలా సీన్లు త‌న ఆర్‌.ఆర్ తో ఎలివేట్ చేశాడు. సాంకేతికంగా ఈ సినిమా గురించి వంక పెట్ట‌లేం. అక్క‌డ‌క్క‌డ చిన్న చిన్న సెటైర్లు ప‌డ్డాయి. లోకేష్‌లో ఉన్న ప్ర‌తిభ ఏమిట‌న్న‌ది ఖైదీతో అర్థ‌మైంది. ఈ సినిమాలోనూ.. త‌న మార్క్ సీన్లు బాగానే క‌నిపిస్తాయి. అవ‌న్నీ బిట్లు బిట్లుగా చూసిన‌ప్పుడు బాగుంటుంది. కానీ క‌థ‌గా ఓ చోట చేర్చిన‌ప్పుడు మాత్రం ఆ బ‌లం స‌రిపోలేదు. థ్రిల్ల‌ర్ ని బాగా మొద‌లెట్టి, ట్విస్టుల్ని కూడా ప‌క్కాగా రాసుకొన్నాడు. కానీ… ఆ ట్విస్టులు స‌రిపోక‌పోవ‌డం, లెంగ్త్ మ‌రీ ఎక్కువ అవ్వ‌డం, యాక్ష‌న్ డోస్ పెర‌గ‌డం. ఇవ‌న్నీ ప్ర‌తికూల అంశాలుగా మారాయి. క‌మ‌ల్ అభిమానులైతే. క‌మ‌ల్, ఫ‌హ‌ద్‌, విజ‌య్ ల‌ను ఒకే ఫ్రేములో చూడాల‌నుకుంటే.. `విక్రమ్‌` కి వెళ్లొచ్చు. అంత‌కంటే ఎక్కువ ఆశించ‌కూడ‌దు.

TELUGU360 RATING : 2.5/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేసు కొట్టేశారు సరే..మరి సీఐడీపై చర్యలొద్దా !?

ఏపీ పోలీసులు నమోదు చేసిన రెండు కేసుల్ని హైకోర్టు కొట్టి వేసింది. ఒకటి నారా లోకేష్‌పై నమోదు చేసిన కోవిడ్ నిబంధనల ఉల్లంఘన కేసు కాగా.. మరొకటి సీనియర్ జర్నలిస్ట్ అంకబాబుపై సీఐడీ...

అప్పట్లో పెట్టుబడుల వరద – ఇప్పుడు సొంత వాళ్లే జంప్ ! చిత్తూరు జిల్లాకు ఇదేం ఖర్మ !

అమరరాజా సంస్థ తమ పెట్టుబడులను ఇతర రాష్ట్రాలకు తరలించడానికి ప్రయత్నిస్తోందని బిజినెస్ వర్గాల్లో కొంత కాలం కిందట ప్రచారం జరిగింది.. అప్పుడు ఘనత వహించిన డీఫ్యక్టో సీఎం.. సకల శాఖల మంత్రి.. ముఖ్యంగా...

సమైక్య రాష్ట్రం చేసేందుకు మళ్లీ చంద్రబాబు కుట్రట !

టీఆర్ఎస్ నేతలకు.. తెలంగాణలో జరుగుతున్న రాజకీయాలను ఎలా ఎదుర్కోవాలో తెలియక మళ్లీ .. సమైక్య వాదుల కుట్రనడం ప్రారంభించేశారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఏడాదిగా కేసీఆర్‌పై సమైక్యవాదులు కుట్ర చేస్తున్నారని.....

రివ్యూ : HIT – ది సెకండ్ కేస్

HIT2 Movie review తెలుగు360 రేటింగ్ 2.75/5 నేర ప‌రిశోధ‌న నేప‌థ్యంలో సాగే క‌థలకి ఎప్పుడూ గిరాకీ వుంటుంది. ఆసక్తికరంగా చూపించాలే గానీ ఆదరించడానికి ప్రేక్షకులు సిద్ధమే. హీరో నాని నిర్మాతగా మారి ఈ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close