తెలంగాణ మహారాష్ట్ర మధ్య కొత్త వివాదం ప్రారంభమవుతోంది. తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 12 గ్రామాలు ఏ రాష్ట్రంలోకి వస్తాయన్న అంశంపై వివాదం ఉంది. తాజాగా మహారాష్ట్ర సీఎం ఓ సమావేశంలో వివాదాస్పద గ్రామాలు మహారాష్ట్ర పరిధిలోకి వస్తాయని ప్రకటించారు. దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటామన్నారు.
భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా పూర్వ ఆదిలాబాద్ జిల్లా ..ప్రస్తుత కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా పరిధిలోకి వచ్చే కెరమెరి మండల పరిధిలోకి కొన్ని గ్రామాలను చేర్చారు. ఆ గ్రామాలు తెలంగాణలో భాగమయ్యాయి. అయితే 1987లో మహారాష్ట్ర ప్రభుత్వం ఇవే గ్రామాలను చంద్రపూర్ జిల్లాలో చేర్చింది. ఇక్కడే వివాదం ప్రారంభమైంది. అప్పటి నుంచి రెండు ప్రభుత్వాలు ఇక్కడి ప్రజల్ని తమ పౌరులుగా చూస్తున్నాయి. ఆ గ్రామాలు తమ రాష్ట్రంలోనిగానే రికార్డుల్లో నమోదు చేసుకున్నాయి. ఈ గ్రామాల్లో ఇరు ప్రభుత్వాల సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. ఈ గ్రామాల్లో ఇద్దరు సర్పంచ్లు ఉంటారు. ఒకరు తెలంగాణ.. మరొకరు మహారాష్ట్ర. ఈ గ్రామాల ఓటర్లు రెండు రాష్ట్రాల్లో జరిగే ప్రతి ఎన్నికల్లోనూ ఓటు హక్కును వినియోగించుకుంటారు.
ఉమ్మడి రాష్ట్రంలో వివాద పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన అ గ్రామాలు ఏపీవేనని నివేదిక ఇచ్చింది. మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. అప్పటి నుంచి ఈ కేసు పెండింగ్లో ఉంది. సుప్రీంలో కేసు ఉన్నా.. ఆ గ్రామాలు మహారాష్ట్రలోనివేనని ఫఢ్నవీస్ ప్రకటించుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకునే అవకాశం ఉంది.