పండగ వస్తే… థియేటర్ల దగ్గర హంగామా రెట్టింపు అవుతుంది. ఇంటిల్లిపాదీ సరదాగా థియేటర్ కి వెళ్లి సినిమా చూడాలనుకొంటారు. అందుకే ఏ పండగ వచ్చినా కొత్త సినిమాల్ని రంగంలోకి దింపడానికి దర్శక నిర్మాతలు గట్టిగా ప్రయత్నిస్తుంటారు. ఈవారం వినాయక చవితి వస్తోంది. అందుకే మూడు సినిమాల్ని సిద్ధం చేసేశారు నిర్మాతలు. సుందరకాండ, బార్బరిక్, కన్యాకుమారి చిత్రాలు ఈ వారం విడుదల కాబోతున్నాయి. మూడు చిన్న సినిమాలే అయినా… వేటికవే ప్రత్యేకమైనవి.
నారా రోహిత్ హీరోగా నటించిన సినిమా ‘సుందరకాండ’. రొమాంటిక్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కింది. పాటలు బాగున్నాయి. ముఖ్యంగా రాప్ సాంగ్ అందరికీ నచ్చింది. చాలా కాలం తరవాత శ్రీదేవి ఈ చిత్రంలో మెరవబోతోంది. పెళ్లీడు దాటిపోయినా అమ్మాయి కోసం అన్వేషించే హీరో కథ ఇది. చాలామందికి కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ తీసుకొన్నారు. రామ్ – కామ్ లో ఒక ప్రయోగం చేశామని చిత్రబృందం పదే పదే చెబుతోంది. ఆ ప్రయోగం ఏమిటన్నది సినిమా చూస్తే గానీ అర్థం కాదు.
సత్యరాజ్, ఉదయభాను, సత్యం రాజేష్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. టీజర్, ట్రైలర్ ఆకట్టుకొంటున్నాయి. ఉదయభాను చేసిన పాత్ర ప్రత్యేక ఆకర్షణ కాబోతోందని చిత్రబృందం చెబుతోంది. ‘మహారాజా’ తరహా స్క్రీన్ ప్లేతో ఈ సినిమాని తీర్చిదిద్దార్ట. థ్రిల్లర్ జోనర్లో సాగే సినిమాలకు మినిమం గ్యారెంటీ ఉంటుంది. స్టార్ కాస్ట్ కూడా ఈ సినిమాకు కలిసొచ్చింది. వినాయక చవితి వల్ల లాంగ్ వీకెండ్ దొరికింది. దాన్ని ఈ సినిమా ఎంత వరకూ సద్వినియోగం చేసుకొంటుందో చూడాలి.
మధుశాలిని సమర్పకురాలిగా మారిన సినిమా ‘కన్యా కుమారి’. నటీనటులు కొత్తవారే. అందువల్ల స్క్రీన్ కి ఫ్రెష్నెస్ వచ్చింది. శ్రీకాకుళం మాండలికం హీరో, హీరోయిన్లు బాగా పట్టేశారు. పల్లెటూరి వాతావరణంలో సాగే అల్లరి ప్రేమకథలో భావోద్వేగాలు కూడా ఆకట్టుకొంటాయని చిత్రబృందం చెబుతోంది. కంటెంట్ పై నమ్మకంతోనే ఈ సినిమాకు సమర్పకురాలిగా మారానని అంటున్నారు మధుశాలిని. మరి ఈ మూడు సినిమాల్లో ప్రేక్షకులు దేనికి ఓటేస్తారో, వినాయక చవితి పండగ ఎవరికి కలిసొస్తుందో చూడాలి.