డ్రైవర్ ను హత్య చేసులో అరెస్టు అయిన శ్రీకాళహస్తి జనసేన ఇంచార్జ్ కోట వినూత బెయిల్ పై విడుదలయ్యారు. ఆమె భర్తకు బెయిల్ వచ్చిందో లేదో స్పష్టత లేదు. అయితే ఇప్పుడు హత్యకు గురైన ఆమె డ్రైవర్ వీడియో లీక్ అయింది. ఎవరు లీక్ చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కానీ.. అందులో బొజ్జల సుధీర్ రెడ్డి మీద.. ఇటీవల నామినేటెడ్ పోస్టులు వచ్చిన జనసేన నేతల మీద ఆరోపణలు ఉన్నాయి. కోట వినూత హత్యకు సుధీర్ రెడ్డి కుట్ర ఉన్నారని ఆ వీడియోలో ఉంది.
హత్యకు ముందు డ్రైవర్ ను బంధించి, బెదిరించి ఇలాంటి వీడియోలు తీసుకున్నారన్న ఆరోపణలు వచ్చాయి. తర్వాత కొట్టి హత్య చేశారు. ఆ తర్వాత చెన్నై తీసుకెళ్లి పడేసి దొరికిపోయారు. అలా తీసుకున్న వీడియోలను ఇప్పుడు లీక్ చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆ డ్రైవర్ చెబుతున్న ఆరోపణలు చూస్తే.. ఎదుటి వారిపై బురద చల్లడానికి ప్రత్యేకంగా స్క్రిప్ట్ రాసుకుని ఎవరెవర్ని టార్గెట్ చేసుకోవాలో ఎంపిక చేసుకుని చెప్పించినట్లుగా ఉందని సులువుగానే అర్థమవుతుంది.
డ్రైవర్ ను హత్య చేసిన తర్వాత .. అంతకు ముందు జరిగిన పరిణామాలపై కోట వినూత, ఆమె భర్త ఇలాంటి ఆరోపణలే చేశారు. సుధీర్ రెడ్డినే టార్గెట్ చేశారు. అయితే తనకేం సంబంధం లేదని సుధీర్ రెడ్డి స్పష్టం చేశారు. ఇలాంటి వీడియోలతో పాటు ఆధారాలు ఏమైనా ఉంటే.. చెన్నై పోలీసులకు ఇవ్వాలి కానీ ఇలా లీకులు చేయడం ఏమిటన్న విస్మయం వ్యక్తమవుతోంది.