సరిపోయింది.. పెద్ద వాళ్ల ప్రశంసలు, అనుకూల మీడియా ప్రచారాలు! కృష్ణా పుష్కరాల విషయంలో ఏర్పాట్ల విషయంలో ఏపీ ప్రభుత్వానికి పెద్ద పెద్ద వాళ్ల ప్రశంసలు దక్కుతున్నాయని, ఏర్పాట్ల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రముఖులు ప్రత్యేకంగా ప్రశంసిస్తున్నారని మీడియాలో కథనాలు వస్తున్నాయి. మరి ఇంత అద్భుతంగా ఉన్నాయా పుష్కర ఏర్పాట్లు అంటే… అసలు విషయాన్ని పుష్కర స్నానం చేసిన సామాన్య భక్తులు మాత్రమే చెప్పగలరు.
మరి ఎవరికి వారు అర్థం చేసుకోదగినది ఏమనగా.. ఏ సందర్భంలో అయినా, ఏ వేడుకల్లో అయినా, ప్రభుత్వాల ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమాల్లో అయినా.. వీఐపీలకు ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి. ఆ కార్యక్రమాల్లో హాజరయ్యే ప్రముఖులకు ఎలాంటి ఇబ్బందీ కలగకుండా చూసుకోవడానికి ప్రత్యేకంగా అధికారులను నియమించడం దగ్గర నుంచి ప్రతి చోటా “వీఐటీ ట్రీట్ మెంట్’’ ఉండనే ఉంటుంది. ఆ ట్రీట్ మెంట్ ను పొందే వాళ్లకు సహజంగానే సకలం సౌలభ్యంగా అనిపిస్తాయి. అంత జనాల మధ్య కూడా తమ అంత సౌకర్యవంతంగా అనిపించడంతో సదరు వీఐపీలు పులకించిపోవడం.. ఆ పులకింతలో ప్రశంసలు కురిపించడం విశేషం ఏమీ కాదు!
సదరు వీఐపీలు తమలాగే అక్కడికి హాజరైన భక్తులకు కూడా సౌకర్యవంతంగా ఉంటుందని అనుకోవచ్చు. ఉదాహరణకు తిరుమల శ్రీవారి దర్శనాన్ని పేర్కొనవచ్చు. అక్కడ వీఐపీలకు దర్శనం ఎంతో సులభంగా అయిపోతుంది.. సామాన్య భక్తులకు అసలు కష్టాలు తెలుస్తాయి. పుష్కరాల విషయంలో అయినా అంతే అనుకోవాలి! కేంద్రమంత్రులు, గవర్నర్లు, ప్రత్యేక అతిధులు .. వీఐపీ కోటాలో పని పూర్తి చేసుకుని.. ఏర్పాట్ల విషయంలో అంతా అదుర్స్ అని అనేస్తారు.
అధికారంలో ఉన్నవారికి అనుకూలంగా ఉండే మీడియా వారితో కలిసి తందానా అంటుంది. అయిపోయింది.. ఈ గొడవలో సామాన్య పుష్కర యాత్రికుల కష్టాల గురించి, వారి కలుగుతున్న అసౌకర్యం గురించి మాట్లాడే నాథుడూ ఎవరూ ఉండరు, అసలు అది ఎవరి నోటీస్ లోకీ రాదు! ప్రచారం వస్తుంది కాబట్టి.. ప్రభుత్వానికి కూడా వీఐపీల ప్రశంసలు చాలు. సామాన్యులు ఎలా పోతే నష్టం ప్రభుత్వానికేంటి?