చాలా కాలం తరవాత కింగ్ కోహ్లీని మైదానంలో చూసే అవకాశం వచ్చింది. అది కూడా ఇండియన్ జెర్సీలో. అయితే ఆ ఆనందాన్ని కోహ్లీ తన ఆటతీరుతో ఆవిరి చేస్తున్నారు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న వన్డే సిరీస్ లో కోహ్లీ పేలవమైన ఆట తీరు కొనసాగుతూనే వుంది. తొలి వన్డేలో డకౌట్ అయి అభిమానుల్ని నిరాశ పరిచిన కోహ్లీ.. రెండో ఇన్నింగ్స్ లోనూ పరుగుల ఖాతా తెరవకుండానే పెవీలియన్ బాట పట్టాడు. వరుసగా రెండు డకౌట్లు అవ్వడంతో కోహ్లీ ఫామ్ పై సందేహాలు మొదలయ్యాయి. వన్డే వరల్డ్ కప్ వరకూ కోహ్లీని ఆడించాలని 2027 వరల్డ్ కప్ తరవాత కోహ్లీ రిటైర్ అయితే బాగుంటుందన్నది అభిమానుల ఆశ. అయితే.. సర్వత్రా జట్టు ప్రయోజనాలే ముఖ్యం అనుకొనే గంభీర్… ఇలా డకౌట్లు అవుతున్న ఆటగాడ్ని జట్టులో కొనసాగించాలనుకోడు. పైగా కోహ్లీ – గంభీర్ మధ్య కోల్డ్ వార్ అనేది ఒకటుంది. సీనియర్లని పక్కన పెట్టి, యువరక్తంలో జట్టుని నింపేయాలని గంభీర్ భావిస్తున్నాడు. కోహ్లీ డకౌట్లు అవ్వడం గంభీర్‌కు ఓరకంగా సాకు దొరికినట్టు అవుతుంది. తొలి వన్డేలో రోహిత్ శర్మ కూడా డకౌట్ అయ్యాడు. కానీ రెండో మ్యాచ్‌లో నిలదొక్కుకున్నడు. అర్థ సెంచరీతో జట్టుని ఆదుకొన్నాడు. కాబట్టి.. రోహిత్ వైపు నుంచి లైన్ క్లియర్. ఇక కోహ్లీ విషయంలోనే గంభీర్ ఎలాంటి నిర్ణయం తీసుకొంటాడన్న ఆసక్తి మొదలైంది.
వరుసగా రెండు డకౌట్లు అవ్వడంతో కోహ్లీ రిటైర్మెంట్ పై మళ్లీ ఊహాగానాలు మొదలైపోయాయి. ఈ సిరీస్ తో.. కోహ్లీ శాశ్వతంగా తప్పుకొంటాడని, తన రిటైర్మెంట్ ప్రకటిస్తాడని క్రీడా వర్గాలు ఊహాగానానికి తెర లేపాయి. సోషల్ మీడియాలో కూడా కోహ్లీకి ఇదే చివరి సిరీస్ అంటూ ప్రచారం మొదలైపోయింది. కోహ్లీ లాంటి ఆటగాడ్ని పక్కన పెట్టడం ఏ టీమ్ కైనా కష్టమే. తనని రిజర్వ్ బెంచ్‌పై కూర్చోబెట్టి ఆట ఆడించలేరు. కోహ్లీ తుది 11 మందిలో ఉండాల్సిన ఆటగాడు. కోహ్లీ కావాలని తప్పుకొంటే తప్ప తనని తప్పించలేరు. ఈ విషయం కోహ్లీకీ తెలుసు. అందుకే గౌరవంగా తన స్థానాన్ని వదులుకొంటే మంచిదని క్రీడా పండితులు వ్యాఖ్యానిస్తున్నారు. మరి ఉండాలా? ఆటకు గుడ్ బై చెప్పాలా అనేది పూర్తిగా తన సొంత నిర్ణయంపై ఆధారపడి వుంది. ఇప్పటికే టీ 20, టెస్ట్ ఫార్మెట్ కు కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. వన్డేలూ వదులకొంటే.. ఓ క్రికెట్ యోధుడికి వీడ్కోలు చెప్పేసినట్టే.