విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు పని చేయకపోతే ఎలా అని చంద్రబాబునాయుడు తీవ్ర అసహనం వ్యక్తం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రైవేటు సంస్థలు స్టీల్ ప్లాంట్లు పెట్టి లాభాల్లోకి వచ్చేస్తున్నాయి. కానీ అన్ని సదుపాయాలు, బోలెడంత చరిత్ర.. బ్రాండ్ ఉన్న స్టీల్ ప్లాంట్ కు మాత్రం నష్టాలు వస్తున్నాయి. ప్రభుత్వం ఎన్ని వేల కోట్లు ఇచ్చినా అంతే. అందుకే చంద్రబాబు సీరియస్ గా స్పందించారు. విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు నిజమే కానీ.. ఇలా ఉద్యోగులు పని చేయకుండా ప్లాంట్ ను లాభాల్లోకి తీసుకు రాకుండా.. ఉంటే టాక్స్ పేయర్స్ మనీని తెచ్చి అందులో ఎందుకు పోస్తామని ప్రశ్నిస్తున్నారు. ఇందులో తప్పు పట్టడానికేమీ లేదు.
స్టీల్ ప్లాంట్‌కు నష్టాలు ఎందుకు వస్తున్నాయి ?
విశాఖ స్టీల్ ప్లాంట్ అంటే.. ఓ ప్రత్యేకమైన బ్రాండ్. క్వాలిటీకి తిరుగులేదు. ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు ఉంది. ఎంత ఉత్పత్తి చేసినా మార్కెటింగ్ అయిపోతుంది. స్టాక్ ఉండదు. కానీ ఎందుకు ఆ బ్రాండ్ ను లాభాల్లోకి వచ్చేందుకు ఉపయోగించుకోవడం లేదు. అక్కడే సమస్య వస్తోంది. ఉద్యోగులు పూర్తి స్థాయిలో పని చేయడం లేదు. ప్రతి చోటా నిర్లక్ష్యం చేస్తున్నారు. మాన్యువల్ తప్పిదాలతో ప్రమాదాలకు కారణమై.. ఉత్పత్తికి ఆటంకం కలిగేలా చేస్తున్నారు. ఉద్యోగుల మధ్య ఆధిపత్య పోరాటంతో పాటు.. లెక్కలేనన్ని వ్యవహారాలతో మొత్తం గందరగోళంగా మారుతోంది. ఉద్యోగుల వల్లనే ఎక్కువ సమస్యలు వస్తున్నాయని ఎప్పటి నుంచో ఆరోపణలు ఉన్నాయి.
అవసరం లేకపోయినా భరిస్తున్న యాజమాన్యం
విశాఖ ఉక్కుకు ఒక్కోసారి బీభత్సమైన లాభం వస్తుంది. ఆ సంస్థకు ఉన్న అప్పులు..ఇతర సమస్యలన్నీ తీర్చి.. రన్నింగ్ క్యాపిటల్ కు కేంద్రం సాయం చేసింది. మొత్తం పన్నెండు వేల కోట్లకుపైగా ఇచ్చింది.అయినా స్టీల్ ఫ్యాక్టరీ పని తీరు మెరుగుపడటం లేదు. ఇంకా ఎన్ని వేల కోట్లు తెచ్చి పోయాలన్నది చంద్రబాబు ఆవేదన. స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల్లో పని చేసే వాళ్లు ముఫ్ఫై శాతానికి మించి ఉండరు. ఆ పని చేసేది కూడా కాంట్రాక్ట్ ఉద్యోగులే. పర్మినెంట్ ఉద్యోగులు పని చేయుకండా జీతాలు తీసుకునేవాళ్లే ఎక్కువ. అది కూడా ఎగ్జిక్యూటివ్స్ లెవల్లో జీతాలు డ్రా చేస్తారు. బయట యూనియన్ల పేరుతో రాజకీయాలు చేస్తూంటారు. వీరందర్నీ .. స్టీల్ ప్లాంట్ సెంటిమెంట్ పేరుతో టాక్స్ పేయర్లు ఎందుకు పోషించాలి.
స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోవాల్సింది ఉద్యోగులే !
ఏదైనా ఓ సంస్థ నిలబడాలంటే.. కష్టపడాల్సింది ఉద్యోగులే. ఎవరి స్థాయిలో వారు తమ పనిని కరెక్ట్ గా చేస్తే సంస్థ నిలబడుతుంది. క్యాప్టివ్ గనులు లేవని..మరొకటని కారణాలు చెబుతూంటారు. ఏ ప్రైవేటు స్టీల్ ప్లాంట్ కూ అలాంటి గనులు లేవు. కానీ అవన్నీ ఎందుకు లాభాల్లో నడుస్తున్నాయి?. రేపు అనకాపల్లిలో ఆర్సెలార్ మిట్టల్ వస్తుంది. ఆ సంస్థకూ లాభాలు వస్తాయి కానీ.. స్టీల్ ప్లాంట్ కు మాత్రం రావు. ఇలాంటి పరిస్థితిని దాటాలాంటే ఉద్యోగులు కష్టపడాల్సిందే. చంద్రబాబు మూడు నెలలకోసారి రివ్యూ చేస్తానని చెప్పారు.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకుండా ఉద్యమం చేసినప్పుడు ప్రజలు మద్దతు ఇచ్చారు. కానీ ఇలా వేల కోట్లు ఆ సంస్థలో పోసి కాపాడుకుంటూంటే..ఉద్యోగులు అప్పనంగా జీతాలు తీసుకుంటున్నారని తెలిస్తే ఎవరూ మద్దతివ్వరు. అప్పుడు ప్రభుత్వాలకు మంచి అవకాశం దొరుకుంది. అందుకే చాయిస్.. స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల చేతుల్లోనే ఉంది. చంద్రబాబు హెచ్చరికల్ని పాజిటివ్ గా తీసుకుని.. ఉద్యోగులే మారాల్సి ఉంది.