విశాఖపట్నం నగరం ఇప్పుడు ఆకాశమే హద్దుగా ఎదుగుతోంది. సమాంతరంగానే కాకుండా, నిలువుగా విస్తరిస్తూ తన రూపురేఖలను మార్చుకుంటోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన భవన నిర్మాణ నిబంధనలు 2025–26, విశాఖ రియల్ ఎస్టేట్ రంగానికి కొత్త ఊపిరి పోశాయి. ముఖ్యంగా హై-రైజ్ బిల్డింగ్‌ల వర్గీకరణను 18 మీటర్ల నుండి 24 మీటర్లకు పెంచడం వల్ల భవన నిర్మాణ అనుమతులు వేగవంతం కావడమే కాకుండా, నగర స్కైలైన్ మరింత ఆకర్షణీయంగా మారబోతోంది.
నగరంలో భూమి లభ్యత తగ్గిపోతున్న తరుణంలో, నిలువు గృహ నిర్మాణమే ఆర్థికంగా లాభదాయకమైన మార్గంగా మారింది. గతంలో ఎఫ్.ఎస్.ఐ 1.0 గా ఉన్నప్పుడు ఒక ఎకరంలో కేవలం 31 ఫ్లాట్లు నిర్మించే వీలుండగా, ఇప్పుడు దానిని 4.0 కి పెంచడంతో ఏకంగా 126 ఫ్లాట్ల వరకు నిర్మించే అవకాశం కలిగింది. దీనివల్ల బిల్డర్లకు నిర్మాణ వ్యయం తగ్గడమే కాకుండా, తక్కువ స్థలంలో ఎక్కువ మందికి నివాస వసతి కల్పించడం సాధ్యమవుతుంది. విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దే క్రమంలో ఇదొక కీలక అడుగు.
ప్రస్తుతం విశాఖలో ఐటీ , పారిశ్రామిక రంగాలు వేగంగా విస్తరిస్తుండటంతో, ప్రీమియం గృహాలకు కోటి రూపాయలకు పైగా విలువైన వాటికి విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా మధురవాడ–కాపులుప్పాడ ఐటీ కారిడార్‌తో పాటు, కొత్తగా వస్తున్న భోగాపురం–భీమిలి బీచ్ రోడ్ ప్రాంతాల్లో గగనతలాన్ని తాకే భారీ అపార్ట్మెంట్లు, విల్లా ప్రాజెక్టులు వెలుస్తున్నాయి. మెరుగైన మౌలిక సదుపాయాలు, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో నిర్మితమవుతున్న ఈ భవనాలు విశాఖను దక్షిణాదిలో ఒక ప్రధాన ఆర్థిక కేంద్రంగా నిలబెట్టనున్నాయి.
