విశాఖపట్నం రూపు మారడానికి సమయం వచ్చేసింది. దిగ్గజ ఐటీ కంపెనీలన్నీ వరుసగా తమ కార్యాలయాల నిర్మాణాలను ప్రారంభించబోతున్నాయి. కాగ్నిజెంట్ నుంచి గూగుల్ వరకు అన్ని సంస్థలు వచ్చే ఆరు నెలల్లో తమ శాశ్వత కార్యాలయాల నిర్మాణాలను ప్రారంభిస్తున్నాయి. శుక్రవారం కాగ్నిజెంట్ తో పాటు మరికొన్ని కార్యాలయాల నిర్మాణాలు ప్రారంభం కానున్నాయి.
కాగ్నిజెంట్ కు శుక్రవారం సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన
విశాఖలో పెట్టుబడులు ప్రకటించిన కాగ్నిజెంట్.. భూములు కేటాయించిన వెంటనే పనులు ప్రారంభిస్తోంది. ఇప్పటికే తమకు కేటాయించిన భూములను చదును చేసేసింది. భవనం డిజైన్ ను ఖరారు చేసుకుంది. కాంట్రాక్టర్ ను ఎంపిక చేసుకుంది. పనులను శుక్రవారం ప్రారంభిస్తోంది. కాగ్నిజెంట్ సీఈవో ప్రత్యేకంగా ఈ క్యాంపస్ శంకుస్థాపనకు వస్తున్నారు. చంద్రబాబు చేతులమీదుగా ఈ క్యాంపస్ నిర్మాణం ప్రారంభమవుతుంది. ఇప్పటికే తాత్కలిక క్యాంపస్ ను కాగ్నిజెంట్ ఏర్పాటు చేసుకుంది. పూర్తి స్థాయిలో సొంత భవనంలో కార్యకలాపాలను కూడా వేగంగా ప్రారంభిస్తారు. దాదాపుగా పది వేల మంది ఐటీ ఉద్యోగాలు ఈ క్యాంపస్లో పని చేయనున్నారు.
ఇక వరుసగా శంకుస్థాపనలు
కూటమి అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే విశాఖను టెక్ హబ్ గా మార్చేందుకు పెట్టుబడులను సేకరించేందుకు శాయశక్తులా ప్రభుత్వపెద్దలు ప్రయత్నించారు. మంచి ఐటీ పాలసీ తెచ్చారు. దీంతో పదుల సంఖ్యలో కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. ఆ కంపెనీల శంకుస్థాపనలు వరుసగా జరగనున్నాయి. త్వరలో టీసీఎస్ ఆఫీసు శంకుస్థాపన జరుగుతుంది. ఇతర మధ్య స్థాయి కంపెనీలు కూడా తమకు కేటాయించిన భూముల్లో పనులు ప్రారంభిస్తున్నాయి. మార్చిలో గూగుల్ ఏఐ హబ్ శంకుస్థాపన జరుగుతుంది.
సత్వ టెక్ భవనం కూడా నిర్మాణం ప్రారంభం
ఐటీ స్పేస్ రంగంలో మార్కెట్ లీడర్ గా ఉన్న ఫత్వా గ్రూప్ కూడా.. ఐటీ కంపెనీల కోసం భవనం నిర్మాణాన్ని ప్రారంభించింది. ఇప్పటికే ఆ సంస్థకు కేటాయించిన భూములు గ్రౌండ్ క్లియరింగ్ పనులు ప్రారంభమయ్యాయి. నిర్మాణం ప్రారంభిస్తే శరవేగంగా పూర్తి చేయడం సత్వాకు అలవాటు. ఎలా చూసినా.. మొత్తం రెండేళ్లలో విశాఖ ఐటీ రూపం మారిపోనుంది. దిగ్గజ కంపెనీల కార్యాలయాలతో.. సాగర్ తీరం..ఐటీ నగరంగా మారనుంది. ఇది విశాఖకే కాదు..ఏపీ రాత మార్చే అవకాశం ఉంది.
