ఈ సంక్రాంతికి ‘మన శంకర వర ప్రసాద్ గారు’తో మెగా ఫ్యాన్స్ పండగ చేసుకొన్నారు. చిరు కెరీర్లో అతి పెద్ద హిట్ ఇది. సంక్రాంతి సీజన్ ఈ సినిమా వసూళ్లకు ఇంకా బాగా కలిసొచ్చింది. ఇప్పుడు అందరి దృష్టీ… ‘విశ్వంభర’పై పడింది. నిజానికి ‘మన శంకర వర ప్రసాద్’ కంటే ముందే విడుదల కావాల్సిన సినిమా ఇది. సీజీ వర్క్ లు పెండింగ్ లో ఉండడం వల్ల వాయిదా పడుతూ వచ్చింది. 2025 చివర్లో ఈ సినిమాని రిలీజ్ చేయడానికి నిర్మాతలు గట్టిగా కృషి చేశారు. కానీ కుదర్లేదు. దాంతో ఈ యేడాదికి షిఫ్ట్ అయ్యింది.
‘మన శంకర వర ప్రసాద్’ హిట్టవ్వడం.. ‘విశ్వంభర’కు కలిసొచ్చే అంశం. అందుకే.. ‘విశ్వంభర’ పనుల్ని స్పీడప్ చేసింది చిత్రబృందం. పండగ తరవాత ‘విశ్వంభర’ సీజీ వర్కులు పునః ప్రారంభం అయ్యాయి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఏడెనిమిది స్టూడియోల్లో పనులు జోరుగా సాగుతున్నాయి. అవుట్ పుట్ చూసుకొన్న తరవాత.. రిలీజ్ డేట్ పై ఓ క్లారిటీ వస్తుంది. మెగాస్టార్ మాత్రం ఈ వేసవి బరిలో ఈ చిత్రాన్ని దించాలని చూస్తున్నారు. ‘విశ్వంభర’లో ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చే అంశాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా పిల్లలు మెచ్చుకొనే ఎపిసోడ్లు ఉన్నాయి. అందుకే వేసవి సీజన్ కరెక్ట్ అని చిరు భావిస్తున్నారు. ఫిబ్రవరి చివరి వారానికి సీజీ వర్కులు పూర్తయి, తొలికాపీ చేతికి అందుతుందని తెలుస్తోంది. మరోవైపు ఓటీటీ డీల్స్ కూడా ఓ కొలిక్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో.. ఏప్రిల్ లేదా మే లలో… ‘విశ్వంభర’ని వెండి తెరపై చూసేయొచ్చు. వశిష్ట దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించిన సంగతి తెలిసిందే. త్రిష కథానాయిక. కీరవాణి సంగీతాన్ని అందించారు.
